ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి పీఎన్వీ రమణ... లివింగ్ ఐడల్ పేరిట ఓ లఘ చిత్రాన్ని రూపొందించి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. మొత్తం 81 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను ఖాతాలో వేసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎఫ్ఏ కోర్సు అభ్యసించిన రమణ... అనంతరం ఉపాధి కోసం ముంబయి చేరుకున్నారు. అక్కడ ఫిల్మ్ లాంగ్వేజ్ కోర్స్ పూర్తి చేసుకొని చిత్ర రంగంలో ప్రవేశించారు. ప్రఖ్యాత చలనచిత్ర కళాకారుడుశేఖర్ కపూర్ వద్ద క్రియేటివ్ అసిస్టెంట్‌గా పది సంవత్సరాలు పని చేశారు. తెలుగువారి నైపుణ్యం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే ధ్యేయంతో లివింగ్ ఐడల్ చిత్రాన్ని 15 నిమిషాల నిడివితో రూపొందించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
తమ పూర్వ విద్యార్థి సాధించిన ఈ అపూర్వ విజయాన్ని గుర్తిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి నాగేశ్వరరావు.. రమణను సత్కరించారు. వైజాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరవ ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధ్యాపకులు, చిత్ర ప్రేమికులు హాజరయ్యారు.