ఇటీవల కాలంలో మావోయిస్టు అగ్రనేతలు ఏవోబీలో సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు నుంచి సమాచారం రావడంతో.. ఆంధ్రా-ఒడిశాకు చెందిన పోలీసు బలగాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. వారిని లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులు చేయడానికి మావోయిస్టులు మందుపాతరలు ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తప్పించుకోవడానికి వీలులేకుండా మావోయిస్టులు వీటిని అమర్చారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఈ సమాచారం పోలీసులకు అందించాడనే నెపంతో ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ స్వాభిమాన్ప్రదేశ్లో మావోయిస్టులు ఒకరిని హత్య చేశారు. ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. చిత్రకొండ బ్లాక్ పరిధిలో జొడొంబో పంచాయతీ ఖజురిగుడ గ్రామానికి 30 మంది మావోయిస్టులు వెళ్లి.. దాసోఖేముడు(25) అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేశారు. సోనాహంతాల్, ఖిలో అనే ఇద్దరిని చితకబాదారు. మరోపక్క గాలింపునకు వస్తున్న పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతరను అమరుస్తున్న మావోయిస్టు మిలీషియా సభ్యుడిని బలపం వద్ద అరెస్ట్ చేసినట్లు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రకటించారు.
అరెస్టయిన మిలిషీయా సభ్యుని వద్ద నుంచి మందుపాతర, రెండు డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మావోయిస్టులు, పోలీసులు కదలికలు పెరగడంతో ఈ ప్రాంత గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఒక పక్క పోలీసులు మావోయిస్టులకు సహకరించవద్దని ప్రచారం నిర్వహిస్తుండగా... మావోయిస్టులు పోలీసులను గ్రామాల్లోకి రానీయవద్దని సూచిస్తున్నారు. మావోయిస్టులు పోలీసులు ప్రతిచర్యలతో ఏవోబీ అట్టుడుకిపోతుంది. ఎప్పడు ఏమి జరుగుతోందనని భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండీ... వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం