విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. 6 వేల 116 ఎకరాలను రైతుల నుంచి సేకరించే క్రమంలో అధికారులకు.. అన్నదాతల నుంచి తీవ్ర నిరసనలు ఎదురువుతున్నాయి. తమ భూములు ఇచ్చేది లేదని అన్ని ప్రాంతాల్లోనూ రైతులు స్పష్టంచేస్తున్నారు. జిల్లాలోని పద్మనాభం మండలం తునివలసలో అధికారులు నిర్వహించిన గ్రామసభకు హాజరైన స్థానికులు ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వానికి ఇచ్చి తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ఊరిలో అందరూ ఎస్సీ రైతులేనని వారి వద్ద ఉన్న ఎకరా, అరకెరా భూములను లాక్కోవడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.
అమరావతి రైతుల పరిస్థితి మాకొద్దు
అనకాపల్లి, ఆనందపురం, సబ్బవరం మండలాల్లోనూ రైతుల నిరసనలతో అధికారులు గ్రామసభలను అర్థంతరంగా ముగించారు. ప్రభుత్వానికి భూములిచ్చి అమరావతి రైతులు పడుతున్న కష్టాలను కళ్లారా చూస్తున్నామన్న వారు మళ్లీ తాము అదే తప్పు చేయలేయని తేల్చిచెప్పారు.
ప్రాణత్యాగానికైనా సిద్ధమే...
తమ అభ్యర్థనలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే ఆందోళలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమన్న రైతులు.. భూమిని మాత్రం వదులుకోబోమన్నారు.