విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని సుమారు 55 వేల ఎకరాలకు సాగునీరు అందించే.. తాండవ నదిలో కొంతమంది అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. దీనివల్ల నదీ పరివాహక ప్రాంతానికి విఘాతం కలుగుతోంది. తాండవ నదీ జలాశయానికి ఆనుకుని.. తూర్పు గోదావరిలో జిల్లాలో సుమారు 18 వేల ఎకరాలకు సాగునీరు తరలించేందుకు చాలా ఏళ్ల కిందట వంతెన నిర్మించారు. అయితే నాతవరం, కొయ్యూరు, గొలుగొండ మండలాల సరిహద్దుల్లో జన సంచారం లేని ప్రాంతాన్ని గుర్తించిన కొందరు.. కొద్దిరోజులుగా అక్రమంగా తవ్వకాలకు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపోలలో సామాన్యులకు ఇసుక ధర అందుబాటులో లేకపోవడంతో ఇలా ఇసుక తవ్వకాలకు పూనుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన జలవనరుల శాఖ అధికారులు.. తవ్వకాల ప్రాంతాన్ని సందర్శించి నివ్వెరపోయారు. అప్పటికే ఆ ప్రాంతమంతా ఇసుక గుట్టలతో నిండిపోయింది. 50 నుంచి 60 వరకు ఇసుక కుప్పలను అధికారులు కనుగొన్నారు. ఇలా చాలా రోజులనుంచి తవ్వకాలు జరుపుతుండగా వంతెన బలహీనంగా తయారైంది. ఇసుక మాఫియాకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని.. తాండవ జలాశయం డీఈ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో.. పోలీసు , రెవెన్యూ అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: పక్షుల కోసం పాటుపడుతున్న యువత