విశాఖ నగరంలో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. కారులో అనధికార సొమ్ము తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు.
సినీ ఫక్కిని తలపించిన ఘటన..
రోషన్ కుమార్ జైన్, చరిత్ర కుమార్ అనే వ్యక్తులు స్థానిక రామ టాకీస్ వద్ద సీ.కె ఎలక్ట్రికల్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం రోషన్ కుమార్ అతని స్నేహితుడు శ్రీనివాసు కలిసి వ్యాపార భాగస్వామి అయిన చరిత్రకుమార్ చెప్పినట్లుగా గాజువాకలోని మయూరి గ్లాస్ ఫ్యాక్టరీ యజమాని విక్రమ్‌ను కలిశారు. అక్కడ రోషన్ కుమార్ తన ఫోనులో ఉన్న 10రూపాయల నోటు నెంబరును విక్రమ్ కు చూపించగా అతను రెండు బ్యాగులో 70 లక్షల నగదును అందజేశాడు. ఆ సొమ్మును ప్రవీణ్ కుమార్ జైన్ అనే వ్యక్తికి అందజేయాలని.. అలా అందజేస్తే లక్షకు వంద రూపాయల చొప్పున కమిషన్ ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు.
ఒప్పందం ప్రకారం డబ్బును తీసుకుని కారులో తిరిగి వస్తుండగా.. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, మూడవ పట్టణ పోలీసులు తెలుగుతల్లి పైవంతెన వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించలేకపోవడంతో పోలీసులు వారి వద్ద నుంచి నగదు, కారు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రెవెన్యూ, ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఈస్ట్ జోన్ ఏసీపీ ఎస్.ఆర్.హరిత చంద్ర తెలిపారు. ఈ కేసులో సంబంధం ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండీ..మోటార్లకు మీటర్ల బిగింపు.. పాలకొండలో ప్రారంభం