Harassment of Minor Girl: గత కొంతకాలంగా విశాఖ నగరానికి చెందిన ఓ బాలికను రాఘవరావు అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. చినవాల్తేర్‌లోని ఓ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న బాలికకు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెట్టడంతో పాటు.. ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఆ బాలిక నివాసం ఉంటున్న ప్లాట్‌కు మద్యం సేవించి వెళ్లిన రాఘవరావు మరోసారి ప్రేమ పేరుతో హల్చల్ చేశాడు. ప్లాట్‌లో నుంచి బయటకు రావాలని ఆ బాలికను వేధించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ బాలిక స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వారించే ప్రయత్నం చేశారు.
అయితే వారిపైనా తిట్ల పురాణంతో బెదిరింపులకు దిగాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన బాలిక స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో 'నువ్ ఏం చేస్తున్నావ్.. నీకు తెలుస్తుందా, నీ మనమరాలి వయసున్న నాతో ప్రేమేంటి, చెప్పు తీసుకొని కొట్టమంటావా' అంటూ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ బాలిక ప్లాట్‌కు వచ్చిన క్రమంలో రాఘవరావు మద్యం సేవించి ఉండటంతో పాటు జేబులో చాకు పెట్టుకుని వచ్చిన విషయాన్ని స్నేహితులు గుర్తించి అతని నుంచి ఆ చాకును లాక్కున్నారు. ఈ ఘటనపై బాలిక తరపువారు పోలీసులను కూడా ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న మూడవ పట్టణ పోలీసులు రాఘవరావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఘటనపై స్పందించిన జనసేన: విశాఖలో మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన రాఘవరావు తమ పార్టీలో ఎటువంటి క్రియాశీలక సభ్యత్వం గాని, బాధ్యతలు గాని లేవని జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఇటువంటి నేరపూరిత చర్యలో ఉన్నవారిపై చట్ట ప్రకారం వ్యవహరించి పారదర్శకంగా ఉండాలని పోలీసు శాఖను కోరామని వివరించింది. ఈ మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోన తాతారావు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాఘవరావు జనసేన ముఖ్యలతో ఫొటోలు తీయించుకున్నారని వాటిని ప్రచారంలోకి తెచ్చినవారు,.. వైసీపీ నేతలతో ఉన్న ఫొటోలు ఎందుకు మర్చిపోయారు అని ప్రశ్నించారు. పార్టీ ముఖ్యులతో ఎందరో ఫొటోలు తీయించుకుంటారని, అంతమాత్రాన వారి పార్టీ బాధ్యతల్లో ఉన్నవారని లేదా నాయకులుగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేసింది. కాగా వైసీపీ నేతలతో ఉన్న రాఘవరావు ఫొటోలను మీడియాతో జనసేన పంచుకుంది.
ఇవీ చదవండి: