విశాఖ జిల్లా మన్యంలోని గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ పెదగొంది గ్రామానికి చెందిన వంతలదెబో దివ్యాంగుడు. కళ్లు పూర్తిగా కనబడని కారణంగా అతనికి పింఛన్ వస్తోంది. కొన్ని కారణాలతో మూడు నెలల నుంచి వంతలదెబోకు పింఛన్ నిలిచిపోయింది. తన సమస్యను పరిష్కరించాలని సంబంధిత వాలంటీర్లు, పంచాయతీ అధికారులను సంప్రదించాడు. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో స్థానిక గ్రామ సచివాలయానికి చేరుకున్నాడు. తనకు పింఛన్ ఇస్తారా?, లేదా? అని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. కర్రతో కొట్టేందుకు యత్నించాడు. హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు గురైన సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో మరింత ఆగ్రహించిన వంతల దెబో... కత్తితో తలుపులపై దాడి చేసి విరగ్గొట్టాడు. కార్యాయలం లోపల ఉన్న మహిళా వాలంటీర్లు ప్రాణభయంతో అరవడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని వంతల దెబోను సముదాయించారు. అధికారులతో మాట్లాడి పింఛను వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగాడు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి హుస్సేన్‌ను వివరణ కోరగా బియ్యం కార్డు లేదన్న కారణంతో దెబోకు పింఛను నిలిపివేసారని అన్నారు.
ఇదీచదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 348 కరోనా కేసులు.. 3 మరణాలు