Works with Heavy Machinery on the Beach: విశాఖలో మార్చి నెలలో జరగనున్న జీ-20 సన్నాహక, పెట్టుబడుల సదస్సుల కోసం.. సముద్ర తీరం సుందరీకరణ పేరుతో జీవీఎంసీ చేస్తున్న విధ్వంసాన్ని పర్యావరణవేత్తలు ఆక్షేపిస్తున్నారు. నగరంలోని అప్పూఘర్ ప్రాంతంలోని తీరంతో పాటు అలలకు అతి సమీపంలోని ఇసుక తిన్నెలను యంత్రాలతో చదును చేశారు.బీచ్ అంతటినీ రెండు, మూడు అడుగుల లోతున తవ్వి కొత్తగా కనిపించేలా మార్చారు. ఇసుక తిన్నెలపై ఉండే తీగ జాతి మొక్కలను పూర్తిగా తొలగించారు. అక్కడున్న గడ్డి మొక్కలు, పొదలను వేళ్లతో సహా పెకలించారు. శ్మశానవాటికకు సమీపంలోనూ ఈ పనులు జరగడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్‌జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా జీవీఎంసీ.. తీరాన్ని విధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే పనులను ఆపాలని.. లేకపోతే హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
నిబంధనలు విస్మరించి: తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనల ప్రకారం తీరంలో ఇసుక తిన్నెలు, ఆటుపోటుల మధ్య ఉన్న స్థలాన్ని యథాతథంగా ఉంచాలి. అక్కడ ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఇసుక ఎగరకుండా ఇసుక తిన్నెల మీద పెరుగుతున్న తీగజాతి మొక్కలు, పొదలను తొలగిస్తే సముద్ర తీర జీవాలకు ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ‘పొదల కింద చాలా జీవావరణం ఉంటుంది. ఇసుక కింద నుంచి ఉండే మొక్కల వేళ్ల వ్యవస్థ జీవావరణ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. ఆ వేళ్లపై పలు జీవులు ఆధారపడి ఉంటాయి. గాలులకు ఇసుక ఎగిరిపోకుండా, ఆటుపోట్ల సమయంలో ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోకుండా ఆ వేళ్లు రక్షణగా నిలుస్తాయి. తీరాన్ని ధ్వంసం చేస్తే.. గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల ఉనికికే ముప్పు కలుగుతుంది. ఇసుక తిన్నెలు సహజంగా ఏర్పడాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. అలాంటి వాటిని ఒక్క వేటు ధ్వంసం చేస్తున్నారు’ అని పలువురు పర్యావరణ ప్రియులు వాపోతున్నారు.
అనుమతి లేకుండా: సుందరీకరణ పనుల నిమిత్తం మూడు రోజుల కిందట సాగర్‌నగర్ బీచ్‌లో అటవీశాఖకు చెందిన స్థలంలో పనులు చేపట్టారు. దీనిపై అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర ప్రాంత రక్షణ స్థలం కావడంతో తప్పనిసరిగా అనుమతులు ఉండాలని చెప్పడంతో అక్కడ పనుల ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది. నగరంలోని అప్పూఘర్ ప్రాంతంలోని తీరాన్ని చదును చేశారు. స్థానికులు వెళ్లి ప్రశ్నించినా కొనసాగించారు. అలలకు అతి సమీపంలోని ఇసుక తిన్నెలను యంత్రాలతో చదును చేశారు. బీచ్ అంతటినీ రెండు, మూడు అడుగుల లోతున తవ్వి కొత్తగా కనిపించేలా మార్చారు. ఇసుక తిన్నెలపై ఉండే తీగ జాతి మొక్కలను పూర్తిగా తొలగించారు. అక్కడున్న గడ్డి మొక్కలు, పొదలను వేళ్లతో సహా పెకలించారు. శ్మశానవాటికకు సమీపంలోనూ ఈ పనులు జరగడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా, సమాధులకు సమీపంలో ఇలా చేయడాన్ని తప్పుపడుతున్నారు.
ఇవీ చదవండి: