ETV Bharat / state

విశాఖను ప్రపంచ నగరంగా మార్చేందుకు.. ఒక్కో నగరం నుంచి ఒక్కో పాఠం! - జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి. సృజన

విశాఖను ప్రపంచనగరంగా మార్చేందుకు రాష్ట్ర బృందంతో కలిసి జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి. సృజన నడుంబిగించారు. ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. అక్కడి విధానాలను విశాఖ నగర అభివృద్ధికి వినియోగించుకునేందుకు ఆమె ప్రణాళికలు రచిస్తున్నారు. వీటిపై గుజరాత్​ నుంచి 'ఈటీవీ - ఈటీవీ భారత్​' తో ముచ్చటించారు.

visaka development tour
విశాఖను ప్రపంచనగరంగా మార్చేందుకు.. ఒక్కో నగరం నుంచి ఒక్కో పాఠం
author img

By

Published : Feb 9, 2021, 6:15 PM IST

హైదరాబాద్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను త్వరలో విశాఖలోనూ అమలుకు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ జీ. సృజన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర బృందంతో కలిసి నగరాల పర్యటనలో ఉన్న ఆమె.. గుజరాత్‌లోని కవేడియాలో సర్దార్‌ వల్లభాయపటేల్‌ మ్యూజియాన్ని సందర్శించారు. ఇప్పటి దాకా పర్యటించిన నగరాల్లో గమనించిన విషయాలు.. విశాఖలో అమలు చేయాలనుకుంటున్న విషయాలను 'ఈటీవీ' తో పంచుకున్నారు.

జలసంరక్షణ పార్కు'హైదరాబాద్‌.. థీమ్‌' అదిరింది!

"తెలంగాణలోని హైదరాబాద్‌ నగరం ఇప్పుడు పార్కుల్లో ప్రయోగాల దిశగా వెళ్తోంది. ఒక్కో పార్క్‌ను ఒక్కో ప్రత్యేక ధీమ్‌తో ప్రజలముందు ఉంచుతున్నారు. పండ్లపార్కులు, జౌషధపార్కులు, సీతాకోకచిలుకల పార్కులు, జలసంరక్షణ పార్కులు.. ఇలా 30 రకాల పార్కుల్ని అక్కడి యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. వాటిలో కొన్ని ఇప్పటికే కళ్లముందుకొచ్చాయి. విశాఖలో ప్రణాళికలో భాగంగా నగరంలోని 1100 ఖాళీస్థలాలను ఇదివరకే గుర్తించాం. వాటన్నింటినీ పార్కులుగా మార్చాలన్నదే లక్ష్యం. హైదరాబాద్‌లో థీమ్‌పార్కులు చూసిన తర్వాత.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం" అని తెలిపారు.

మేం బాగా ఇష్టపడుతున్నది...

జల సంరక్షణ పార్క్‌. సోక్‌పెట్‌, రూఫ్‌టాప్‌, ఇంజక్షన్‌ వెల్‌ ఇలా పలురకాల పద్ధతులను ఆ పార్కుల్లోకి తేవడంతోపాటు పిల్లలకు, పెద్దలకు అన్నిరకాలుగా అవగాహన కల్పించాలనుకుంటున్నామని సృజన చెప్పారు. పార్కంటే పచ్చదనం అన్నమాటే కాకుండా.. ఔషధగుణాలున్న మొక్కలతో ప్రత్యేకంగా మరో పార్కును తెచ్చి ఇళ్లలో ఏమేం మొక్కలు పెంచుకోవచ్చు, వాటి ఉపయోగాలను అక్కడ వివరిస్తామన్నారు. పిల్లల్లో విజ్ఞానం కోసం.. సైన్స్‌పార్కునూ ఏర్పాటుచేయాలనే మరోఆలోచన ఉందన్నారు.

ఇండోర్‌... వెరీ 'సాలిడ్‌'!

"మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో అమలు చేస్తున్న చర్యలు అత్యద్భుతం. ప్రతీగ్రాము చెత్తనీ వేరుచేసి మరీ ప్రయోజనాలు పొందుతున్నారక్కడ. నగర వీధుల్లో చెత్త సేకరణకు తోపుడు బళ్లనేవే లేవు. కేవలం ట్రాలీఆటోల్నే వినియోగిస్తున్నారు. ఒక్కో ఆటోలో డ్రైవర్‌, పారిశుద్ధ్యసిబ్బంది, జనాల్లో అవగాహన పెంచేందుకు సామాజిక కార్యకర్త ఉంటారు" అని సృజన తెలిపారు.

విశాఖలో ప్రణాళికలు:

ఇండోర్‌ పారిశుద్ధ్యంతో పోల్చుకుంటే విశాఖలో సగభాగం అమలవుతోంది. ఆ నగరం నుంచి చాలా నేర్చుకున్నాం. ప్రధానంగా చెత్తను వేరుచేసే ప్రక్రియను మనదగ్గర పూర్తిస్థాయిలో అమలుచేయాల్సి ఉంది. ఇండోర్‌ తరహాలో చెత్తకుండీ లేని నగరంగా చేయాలనేదే లక్ష్యమని అధికారులు అన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కేవలం చెత్తవాహనాల్ని పంపి చెత్తను సేకరిస్తున్నాం. కొండ ప్రాంతాలు మినహా మిగిలిన అన్నిచోట్లా ఈ పద్ధతి ఉండాలనే నిర్ణయానికి వచ్చాం. ఆ వాహనాల వెంట వార్డు కార్యదర్శి ఉండేలా.. వారే ప్రజలకు అవగాహన కల్పించేలా చూస్తామన్నారు. ప్రత్యేకించి సీఎన్‌జీ గ్యాస్‌ ప్లాంటును జీవీఎంసీలో ఏర్పాటుచేయాలనే ఆలోచన ఉంది.

పర్‌ఫెక్ట్‌ "లేఅవుట్"‌!

లేఅవుట్‌లకు అనుమతిచ్చే ప్రక్రియ అత్యంత ప్రయోజనకరంగా ఉందక్కడ. కొంతమంది డెవలపర్స్‌ని కలిపి సంయుక్త లేఅవుట్‌కు అనుమతులు ఇవ్వడంతో పాటు.. ల్యాండ్‌ పూలింగ్‌ తరహాలో ఆ లేఅవుట్‌కు కావాల్సిన వసతులన్నీ ముందే కార్పొరేషన్‌ సమకూరుస్తోంది. రోడ్లు, కాలువలు, తాగునీరు, పార్కులు, వీధిదీపాలు ఇలా లేఅవుట్‌లో స్థలాల విక్రయానికి ముందే వచ్చేస్తాయి. పలితంగా అక్కడికొచ్చే కుటుంబీకులకు వసతుల సమస్య ఉండదు. ఉదాహరణకు 100 ఎకరాల లేఅవుట్‌ ఉంటే.. అందులో 40 ఎకరాల్ని యజమానులు కార్పొరేషన్‌కు ముందే అప్పగించేస్తారు. వసతులు రావడంతో మిగిలిన 60 ఎకరాలకు విలువ పెరుగుతుంది.

అహ్మదాబాద్‌ సాధించిన మరో విజయం...

సబర్మతీ నది ఒడ్డున రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టు పనులతో నదికి ఇరువైపులా ఉన్న మురికివాడల్ని తీసేసి.. అక్కడి పేదవారికి ఉచితంగా అద్భుతమైన ఇళ్లు కట్టించారు. నదివెంబడి అద్భుత డిజైన్లతో పార్కులు, నడకకు, సైక్లింగ్​కు బాటలు, ఆంపీ థియేటర్లు, రంగుల విద్యుద్దీపాల ఏర్పాట్లతో పర్యాటకానికే వన్నె తెచ్చేలా ఉంది ఆ ప్రాంతం. నదిలో కాలువలు కలవడమనే సమస్యే లేదు. మరోవైపు ఇదే నగరంలో కార్పొరేషన్‌, నగరాభివృద్ధి సంస్థలు కలిసి ఇళ్లు కట్టించి తక్కువ ధరలో సామాన్యులకు అద్దెకు ఇస్తున్నారు.

విశాఖలో ప్రణాళికలు

మనదగ్గర లేఅవుట్‌లకు అనుమతిలిచ్చిన తర్వాత వసతులు ఆలస్యంగా వస్తున్నాయని... ఇలా కాకుండా అహ్మదాబాద్‌ తరహాలో ముందే వసతులిచ్చేలా నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు. పట్టణ ప్రణాళికల నిబంధనల్లో మార్పులు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తోందని చెప్పారు. వీఎంఆర్‌డీఏతో కలిసి వినూత్నంగా 100 ఎకరాల్లో ఈ ప్రయోగం చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. సబర్మతీ నది ప్రాజెక్టు తరహాలో ఆర్‌కేబీచ్‌ ఫ్రంట్‌ ఉండబోతోందన్నారు. అలాగే ఆర్‌కే బీచ్‌నుంచి భీమిలి వరకు 27 కి.మీ మేర సైకిల్‌, నడక బాటలతో పాటు మధ్యమధ్యలో మంగమారిపేట, సాగర్‌నగర్‌, లాసన్స్‌బే ఇలాంటి ప్రాంతాల్ని అహ్మదాబాద్‌ తరహాలో వృద్ధి చేయాలని అనుకుంటున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

ఉక్కు పరిశ్రమపై ప్రధానికి సీఎం లేఖ రాసినందుకు ధన్యవాదాలు: గంటా

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.