విశాఖ పోలీసుల ఎదుట నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. పెదబయలు సీపీఐ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు సహా మిలీషియా కమాండర్, ఇద్దరు కొరుకొండ ప్రాంత సాయుధ మిలీషియా సభ్యులు వీరిలో ఉన్నారు.
సీతపై 4లక్షల రివార్డు
కొర్రా సీత అలియాస్ స్వర్ణ, అలియాస్ శైలు పెదబయలు మండలం జామిగూడా పంచాయితీకి సాకిరేవు గ్రామానికి చెందిన డుంబ్రి కుమార్తె. ఈమె 2010లో పార్టీలో చేరింది. తొమ్మిది హత్యలు, ఒక మందుపాతర, ఆరు ఎదురుకాల్పుల ఘటనలు, రెండు ఆంబుష్ ఘటనల(పోలీసుల గురించి మాటు వేయడం)లోనూ, ఒక అస్తుల విధ్వంసం, ఒక కరువుదాడి, ఒక ప్రజాకోర్టు నిర్వహణ కేసులు ఈమెపై ఉన్నాయి. ఈమెపై నాలుగు లక్షల రివార్డును పోలీసు శాఖ ప్రకటించింది.
జనజీవన స్రవంతిలో కలిసేందుకే...
పాంగి ముసిరి అలియాస్ చిట్టిబాబు కూడా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి. 2010లో మావోయిస్టుల్లో చేరి బుసిపుట్టు పాకెట్‌కి మిలీషియా కమాండర్‌గా పని చేస్తున్నారు. ఏడు నేర ఘటనలలో ఈయన పాల్గొన్నాడు. చింతపల్లి మండలం, బలపం పంచాయతీ, ములగల వీధి గ్రామానికి చెందిన కొర్రా వెంకటరావు, పాంగి గోపాలరావు అలియాస్ గోపాల్ కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరంతా అనారోగ్యం, పోలీసుల కూంబింగ్ వంటి వాటి కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోతున్నట్టు ప్రకటించారు. విశాఖ రేంజి డీఐజీ రంగారావు, విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఇతర పొలీసు ఉన్నతాధికారుల ఎదుట వీరు లొంగిపోయారు. హింసా మార్గం కాకుండా, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం ద్వారానే గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారమవుతాయని డీఐజీ రంగారావు అన్నారు.
ఇదీ చదవండి: