Ex Servicemen Agitation on no Against Action Attack on Ex Serviceman: మాజీ సైనికుడిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా పద్మనాభం మండల పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ సైనికులు ఆందోళన చేపట్టారు. పద్మనాభం మండలం రౌతులపాలెంలో ఈనెల 22న రాత్రి సమయంలో మాజీ సైనికుడు ఆదినారాయణపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దాడి జరిగి వారం రోజులైనా ఇప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు ఆలస్యం చేస్తున్నారని మాజీ సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు అలసత్యం వహించటంపై మాజీ సైనికుల సంఘం మండిపడింది. దాడికి పాల్పడిన వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని రాష్ట్ర మాజీ సైనికుల సంయుక్త కార్యదర్శి రెడ్డి అప్పలనాయుడు, సలహాదారు తెంటు సత్యారావు, విజయనగరం జిల్లా అధ్యక్షులు రెడ్డి దామోదర్లు పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఐ ఇచ్చిన సమాధానానికి మాజీ సైనికులు విస్తుపోయారు. ఏవో పొంతనలేని కేసులు నమోదు చేశారని అగ్రహం వ్యక్తం చేశారు.
జీతాలు రాక కష్టాల్లో నలుగుతున్న మాజీ సైనికులు
నిబంధనల ప్రకారం బాధితుల వాంగ్మూలం, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాల్సి ఉండగా.. పోలీసులు దీనికి విరుద్ధంగా పొంతన లేని కేసులు నమోదు చేయడంపై మాజీ సైనికులు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా దారి కాసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల చెప్పులు, టోపీలు, దాడికి ఉపయోగించిన ఇనుప రాడ్లను పోలీసులకు అప్పగించినా తప్పుడు కేసు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు.
మాజీ సైనికుల ఆందోళనతోనే కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సైతో సీఐ ఫోన్లో మాట్లాడినట్లు మాజీ సైనికులు తెలిపారు. కేసు నమోదు చేసిన రోజు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు టోపీలు, రాడ్లు, చెప్పులు మీరు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారని సీఐ.. ఎస్సైని అప్పుడే అడిగినట్లు వివరించారు. సీఐ ప్రశ్నకు సమాధానంగా ఎస్సై సెంట్రీకి హ్యాండ్ ఓవర్ చేశానని సమాధానమిచ్చినట్లు వివరించారు. అలా సెంట్రీకి అప్పగిస్తే ఎలా అని సీఐ అగ్రహం వ్యక్తం చేసినట్లు వివరించారు.
రిలే నిరాహార దీక్షలకు దిగిన మాజీ సైనికులు
అవి ఎక్కడ ఉన్నాయో విచారణ చేపట్టి తనకు అప్పగించాలని సీఐ.. ఎస్సైని ఆదేశించినట్లు తెలిపారు. ఘటన జరిగిన సీఐ ఎస్సైతో కేసు వివరాలు ఆరా తీయటంతో మాజీ సైనికులు వాపోయారు. అంతేకాకుండా పోలీసులను కేసు గురించి ప్రశ్నిస్తే ఒకరిపై ఒకరు తోసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హత్యయత్నం కేసులో బాధ్యత వహించాల్సిన సీఐ, ఎస్సైలు నిందితులను తప్పించే ఉద్దేశ్యంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ సైనికులు ఆరోపిస్తున్నారు.
మాజీ సైనికుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాజీ సైనికుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఉద్యమిస్తామని మాజీ సైనికులు హెచ్చరించారు.