మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై.. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. విశాఖ జిల్లా హుకుంపేట మండలం గడుగుపల్లిలో.. తెదేపా నుంచి గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఓటర్లను మభ్యపెట్టి, భయపెట్టి, సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏజెన్సీలో తెదేపా తరఫున గెలిచిన సర్పంచులు, వార్డ్ మెంబర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ నిధుల విషయంలో రాష్ట్ర నాయకులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
14 ఏళ్ల పాటు సీఎంగా సేవలందించిన చంద్రబాబుపై.. అమరావతి భూ లావాదేవీల విషయంలో తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. తెదేపా హయాంలో గడుగుపల్లికి వచ్చిన మంచినీటి పథకాన్ని వెనక్కి మళ్లించేందుకు వైకాపా నేతలు యత్నించారంటూ విమర్శించారు. అంతకంతకూ పార్టీ బలోపేతం అవుతోందని.. ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
ఇదీ చదవండి: