మాజీ సైనికులకు భూములిప్పిస్తామని చెప్పి 24 కోట్లు రూపాయలు వసూలు చేసి దుర్వినియోగం చేసిన కేసులో 8మందిని అరెస్టు చేసినట్టు... సీఐడీ సీఐ మళ్ల శేషు వెల్లడించారు. కొందరు మాజీ సైనికోద్యోగులు ‘ఎక్స్ సర్వీస్‌మెన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ’ పేరిట ఒక సొసైటీని ఏర్పాటుచేసి ప్రభుత్వం నుంచి స్థలాన్ని తీసుకుంటున్నామని, సభ్యులకు ప్లాట్లు ఇప్పిస్తామని పేర్కొన్నారు.
దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 3,594 మంది ఒక్కొక్కరు 1.25 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. అలా సొసైటీకి సుమారు 24 కోట్ల రూపాయలు సమకూరింది. సొసైటీకి ప్రభుత్వం ఆనందపురం మండలంలో భూమి కేటాయించిందని, దాన్ని ప్లాట్లుగా అభివృద్ధి చేయాలంటూ కార్యవర్గ సభ్యులు కోట్ల రూపాయలు వెచ్చించారు. వాస్తవానికి ఆ భూమిని ప్రభుత్వం అసలు కేటాయించనేలేదు.
విషయం తెలుసుకున్న మజ్జి సీతమ్మతోపాటు 94 మంది 2018లో విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాడు సీఐగా ఉన్న మళ్ల శేషు ఆ కేసును సీఐడీకి బదలాయించాలని కోరారు.. ప్రస్తుతం సీఐడీలో ఉన్న శేషుకే తాజాగా ఆ కేసు విచారణ బాధ్యతలు అప్పగించడంతో ఆయన రంగంలోకి దిగారు. నాడు సొసైటీ కార్యవర్గ సభ్యులుగా ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు.
నాడు జిల్లా సైనిక సంక్షేమ అధికారిగా పని చేసిన పి.సత్యప్రసాద్ ప్రోద్బలంతోనే వసూళ్లకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సైనిక సంక్షేమ అధికారిగా ఉన్నారు.
ఇదీ చదవండి: ప్లాస్టిక్ కవర్లలో గంజాయి తరలిస్తూ చిక్కారిలా!