విశాఖ నుంచి కొత్త దిల్లీకి శీతల కోచ్‌లతో నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై వచ్చిన ఫిర్యాదులకు లెక్క లేదు. ఏసీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై... ఆ రైలు ప్రయాణించిన అన్ని రాష్ట్రాల్లోనూ ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిపై ఈటీవీ భారత్- ఈటీవీ-ఈనాడు ప్రచురించిన కథనాలపై రైల్వే అధికారులు స్పందించారు. ప్రతి బోగీకి విద్యుత్ సరఫరా అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇన్నాళ్లూ డీజిల్ జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరాతో ఏసీలు పని చేసేవి. దీనివల్ల కేబులింగ్‌లో ఎక్కడ లోపం తలెత్తినా 3 నుంచి 4 కోచ్‌ల్లో ఏసీలు ఆగిపోయేవి. దీనికి పరిష్కారంగా అన్ని బోగీలకూ విద్యుత్ అందివ్వాలని అధికారులు నిర్ణయించారు. అంతేగాక సాంకేతిక మార్పులు చేస్తున్నారు. దీని వల్ల కాలుష్యం తగ్గడంతోపాటు ఏసీల మొరాయింపు సమస్య ఉండదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
దీని కోసం రైల్వే సిబ్బందికి కొంత అదనపు శిక్షణ, సూచనలు ఇవ్వనున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్ వేళలు మార్పు చేయాలని వాల్తేర్ డివిజన్ అధికారులు చేసిన ప్రతిపాదనపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. జులై 1 నుంచి వచ్చిన కొత్త టైమ్ టేబుల్‌లో వీటి ఊసు లేకపోవడం వల్ల కాస్త గందరగోళం నెలకొంది.