విశాఖ మహా నగరంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.... విద్యుత్ సరఫరాను పెంచేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ-ఈపీడీసీఎల్ సిద్ధమైంది. ప్రతి ఉపకేంద్రం సామర్థ్యంలో... 50శాతం లోడ్‌ను మాత్రమే వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ఒక విద్యుత్ సబ్ స్టేషన్‌పై పూర్తి లోడ్ భారం పడకుండా.... విశాఖలో సబ్ స్టేషన్లను తీసుకురానుంది. 10 వేల కోట్ల రూపాయల అంచనాలతో కేంద్ర, రాష్ట్ర విద్యుత్ శాఖలకు ప్రతిపాదనలు పంపింది.
వచ్చే 30ఏళ్లలో విశాఖ చుట్టుపక్కల పారిశ్రామిక అవసరాలు, గృహవినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్ ప్రత్యేక సర్వే నిర్వహించింది. వచ్చే పదేళ్లలో రోజుకు 25మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమయ్యే స్థాయికి విశాఖ నగరం చేరుకుంటుందని అంచనా వేసింది. నగరంలో ఇప్పుడున్న విద్యుత్తు వినియోగం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. తక్కువ సరఫరాతో వచ్చే విద్యుత్తు నష్టాలను అధికారులు అంచనా వేశారు. ఆ నష్టాన్ని అరికట్టేలా, సరఫరా వనరులను పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు 10వేల కోట్ల రూపాయల అంచనాలతో విద్యుత్తు శాఖకు ప్రతిపాదనలు పంపారు.
విశాఖ నగరం భవిష్యత్తు అవసరాలను తీర్చేలా 5 భారీ సబ్‌స్టేషన్లను ప్రతిపాదించగా.. వాటన్నింటినీ ట్రాన్స్‌కో ద్వారా మంజూరు చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 820కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. వచ్చే 50ఏళ్ల అవసరాలకోసం విస్తరించుకునేలా ఈ సబ్‌స్టేషన్లను డిజైన్ చేశారు. కంచరపాలెంలో 2 ఎకరాల్లో అధునాతన 220/132/33KV బహుళార్థక సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు అనుమతులు వచ్చాయి.
" కంచరపాలెంలో 2 ఎకరాల్లో అధునాతన 220/132/33KV బహుళార్థక సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు అనుమతులు వచ్చాయి. NSPL, ఎండాడ దగ్గర రెండు సబ్ స్టేషన్లు అడిగాము. వాటికి కూడా అనుమతులు రానున్నాయి. కంపెనీ మొత్తంలో25సంవత్సరాల వరకూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు చేస్తున్నాం. " -సంతోషరావు, సీఎండీ ఈపీడీసీఎల్
రానున్న రోజుల్లో విశాఖ-భోగాపురం మధ్య 6 వరుసలరోడ్డు రానుండటంతో పాటు ఇదే మార్గంలో చాలా ప్రాజెక్టులు వస్తాయనే అంచనాలూ వేస్తున్నారు. ఇదే దారిలో ఐటీ హిల్స్ ఉండటం, పర్యాటక ప్రాంతాలు వృద్ధిచెందే అవకాశలుండటం, పారిశ్రామిక వృద్ధికీ అవకాశముండటంతో అదనపు లోడ్‌ను పెంచేందుకు రెండు 132/33 KV సబ్‌స్టేషన్లు తీసుకొస్తున్నారు. కాపులుప్పాడ సమీపంలో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ఓ సబ్‌స్టేషన్ పనులు మొదలుపెట్టారు. ఎండాడ చెరువు సమీపంలో మరొకటి నిర్మించేందుకు ముందుకొస్తున్నారు.
" సముద్రతీర ప్రాంత నగరం కావడంతో ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు కూడా విద్యుత్ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భూగర్భ కేబుల్ వ్యవస్థను నగరం అంతా ప్రతిపాదించడం జరిగింది. వినియోగదారుడికి క్వాలిటీ విద్యుత్ సరఫరానే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ప్రతిపాదనలు చేశాం. " -సూర్య ప్రతాప్, ఎస్.ఈ. ఏపీఈపీడీసీఎల్
విశాఖలో అన్ని సబ్‌స్టేషన్లకూ భూగర్భ విద్యుత్తు వ్యవస్థను అనుసంధానించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. E.P.D.C.L. ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్’ ద్వారా చేసేందుకు D.P.R. కూడా సిద్ధం చేసి పంపారు. ప్రతి వినియోగదారుడ్ని స్మార్ట్‌మీటర్ల పరిధిలోకి తెచ్చేలా మరో ప్రతిపాదన చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : భగవంతుడ్ని భక్తులకు దగ్గర చేసే వారథే విశాఖ శ్రీ శారదాపీఠం