DRDO Ex Chairman Satish Reddy in CII Meeting: రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూనే కలిసి పనిచేయడానికి కేంద్రం అనేక అవకాశాలు కల్పిస్తోందని రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి వెల్లడించారు. రక్షణ శాఖకు విశాఖపట్నం అన్ని విధాలుగా వ్యూహాత్మక కేంద్రమని, నౌకాదళం, -షిప్‌యార్డు, ఎన్ఎస్ఓఎల్ రక్షణ రంగ పరిశోధనల్లో సాంకేతికంగా ఇక్కడ ఎంతో వృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం విశాఖలో సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ కంపెనీల నిర్వాహకులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని.. పలువురి సందేహాలను నివృత్తి చేశారు. అంతకుముందు మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ పిలుపు దేశీయ ఉత్పత్తులను గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు.
రక్షణ రంగంలో ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని తెలిపారు. దీంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసే.. దృక్పథం మారిందని స్పష్టం చేశారు. గత సంవత్సరం మన దేశం నుంచి 16 వేల కోట్ల రూపాయల మేర రక్షణరంగ ఎగుమతులు జరిగాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణరంగ అవసరాలను ప్రైవేటు సంస్థలు తీరుస్తున్నాయని పేర్కొన్నారు. క్షిపణులు, బాంబులను తయారు చేస్తున్నాయని.. ఏడు వరకు ప్రైవేటు సంస్థలు క్షిపణుల ఉత్పత్తుల్లో ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదని స్పష్టం చేశారు. పరిశ్రమల ప్రోత్సాహానికి పలు పథకాల ద్వారా కేంద్రం నిధులను సైతం అందజేస్తుందని వివరించారు.
డీఆర్డీవో 150 డీసీపీపీ (డెవలప్మెంట్ కం ప్రొడక్షన్ పార్టనర్)తో కలిసి పనిచేస్తుందని తెలిపారు. రక్షణ, అత్యాధునిక సాంకేతిక అంశాలపై 15 పరిశోధన కేంద్రాలు దేశంలో డీఆర్డీవో ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయన్నారు. ఎన్నో అంకుర సంస్థలు వస్తున్నాయని.. డ్రోన్లకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని.. వీటన్నింటినీ దాదాపు యువతే చేపడుతోందన్నారు. దేశంలో స్టార్టప్స్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. మన దేశంలో 2016 నాటికి 400 స్టార్టప్‌లు ఉంటే.. ఇప్పుడు ఒక లక్ష వరకూ ఉన్నాయని..వాటి మైండ్ సెట్ చాలా ఉన్నతంగా ఉండడం బాగా ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. ప్రపంచస్ధాయి పోటీని ఎదుర్కొనే ఉత్పత్తులే స్టార్టప్‌ల లక్ష్యంగా ఉన్నాయని చెప్పారు. ప్రీమియర్ సంస్థల్లోంచి (ఐఐటీ) వచ్చే యువత గతంలో విదేశాల వైపు చూసేవారని.. ఇప్పుడు 70 శాతం మంది దేశంలోనే పని చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. 'వైభవ్' అనే కార్యక్రమం కింద విదేశాల్లో భారత సంతతికి చెందిన వారి సలహాలు, సంప్రదింపులను ఆహ్వానించడం ద్వారా మరింత మెరుగ్గా ఉత్పత్తులను తీర్చిదిద్దుకునేందుకు వీలవుతుందన్నారు.