విశాఖ మారుమూల కొండల్లో ఆదివాసీ గిరిజనులు రహదారి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి అందుబాటులో లేక డోలీలో నిండు గర్భిణిని మోసుకువెళ్తుండగా మార్గంలో ప్రసవమై.. శిశువు కన్నుమూసిన ఘటన మన్యంలో జరిగింది.
చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీలో మారుమూలనున్న కరకపల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి కొర్రా దేవిని గ్రామస్థులు ఆసుపత్రికి చేర్చేలోపే ప్రసవమైంది. ఆడబిడ్డకు జన్మనిచ్చినా.. పుట్టిన వెంటనే శిశువు మరణించింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకపల్లికి చెందిన కొర్రా దేవికి నలుగురు పిల్లలు. ఐదో కాన్పులో పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు లోతుగెడ్డ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. రహదారి, రవాణా సదుపాయం లేకపోవడంతో పల్లకిలో ఐదు కిలోమీటర్ల దూరం మోసుకువచ్చారు. మార్గమధ్యంలో నొప్పులు అధికమై ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే ఆడబిడ్డ మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు రోదిస్తూ ఇంటిముఖం పట్టారు.
ఏ కాలంలో అయినా మన్యం వాసుల కష్టాలు తీరడం లేదు. వానాకాలం వచ్చిందంటే చాలు మన్యం వాసులు చివుటాకుల్లా వణికిపోతారు. ఎప్పుడు వర్షం పడుతుందో.. ఎప్పుడు వాగు పొంగుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటారు. ప్రతీ ఏటా వానాకాలంలో ఉప్పొంగడం సహజం. దీంతో ఆదివాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాగులు ఉధృతంగా ప్రవహించినన్ని రోజులు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోతారు.
ఈ కష్టాలు ఎన్నో ఏళ్లుగా కనిపిస్తూనే ఉన్నా.. ఈ విషయాలన్నీ తెలిసినా ప్రజాప్రతినిధులు స్పందించరు. ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రికి వెళ్లాలన్నా, గర్భిణులు ప్రసవాలకు వెళ్లాలన్నా, ఎవరైనా ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో కానీ ఇతరత్రా కారణాలతో మృతిచెందిన సమయంలో వారి మృతదేహాలను ఊళ్లలోకి తీసుకురావాలన్నా ఇబ్బందులు పడాల్సిందే. డోలీ కట్టాల్సిందే. ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
ఇదీ చదవండి: డోలీ కట్టి వర్షంలోనే గర్భిణీ తరలింపు