స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికి మన్యంలోని మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేక గిరిపుత్రులు నానా అవస్థలు పడుతున్నారు. నిండు గర్భిణులకు పురుటి నొప్పులు వస్తే... డోలీమోతలు తప్పడం లేదు. విశాఖ జిల్లా సుల్తాన్పుట్ గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని తరలించడానికి చాలా ప్రయాస పడాల్సివచ్చింది. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. ప్రసవించిన వెంటేనే మగబిడ్డ మరణించాడు. ఈ ఘటన ఆ తల్లికి కడపుకోతను మిగిల్చింది.
విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్ పంచాయతీ సుల్తాన్పుట్ గ్రామ ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదు. గ్రామానికి చెందిన పాంగిచెల్లామ్మ నిండు గర్భిణి. ఆమె గత మూడు రోజులుగా పురుటి నొప్పులతో బాధపడుతోంది. గురువారం నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించాలనుకున్నారు. ఆ వాహనం కాస్త.. ఘాట్ రోడ్డున వెళ్తుంటే... బురదలో నిలిచిపోయింది. దీంతో చేసేదేం లేక కుటుంబీకులు కొంత దూరం డోలీమీద.. మరికొంత దూరం ఎత్తుకుని తీసుకెళ్లారు. ఆ మహిళ మూడు కిలోమీటర్ల మేర బంధువులు అతికష్టం మీద నడిపించుకుని తీసుకువెళ్లారు.
పరిస్థితి తెలుసుకున్న అక్కడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని... అంబులెన్స్ సౌకర్య ఉన్న కుమడ గ్రామానికి తీసుకువెళ్లారు. 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అదే ప్రైవేటు వాహనంలో రూడకోట పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ముంచంగిపుట్టు వద్ద గల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమె మగ బిడ్డకు జన్మనివ్వగా.. ఆ బాలుడు మరణించాడు. సరైన రహదారులు లేకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మారుమూల ప్రాంతంలో ముంచంగిపుట్టు పెదబయలు మండలాల్లో సరిహద్దులో ఉన్న ఇంజరి, బూసిపుట్, జామి గూడ పంచాయతీల వాసులు రోజు ఇదే అవస్థలు పడుతున్నారు. విశాఖ ఏజెన్సీ మారుమూల గ్రామాలకు సరైన రహదారి సౌకర్య లేకపోవడంతో తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇదీ చదవండి: మన్యంలో తుపాకులు వదిలి.. పాఠాలు చెబుతున్న ఖాకీలు!