విశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి నెల రోజులు దాటినా న్యాయం జరగలేదని బాధిత గ్రామస్థులు వాపోతున్నారు. ఆ ఘటనలో అతి కష్టం మీద ప్రాణాలు కాపాడుకొని... ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితుడికి పరిహారం ఇచ్చే విషయంలో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
స్టైరీన్ గ్యాస్ లీక్ బాధిత గ్రామమైన ఆర్ఆర్ వెంకటాపురానికి చెందిన ఉరుకుటి రాజేష్ ప్రమాదం జరిగిన రోజు... తన అక్క కుమారులతో ఇంట్లో ఉన్నారు. స్టైరీన్ గ్యాస్ ఇంట్లోకి రావటం మెుదలయ్యింది. ఆ సమయంలో బయటకు వచ్చే ప్రయత్నంలో రాజేష్ తలకు బలమైన గాయమైంది. గాయంతో అపస్మారక స్థితికి వెళ్తున్నా.. తన ప్రాణాలు పోయినా తన అక్క బిడ్డలు ప్రాణాలు కాపాడాలని అతి కష్టం మీద వంటింటిలో ఉన్న "వేడి గాలి బయటకు పోయే యంత్రాన్ని" ఆన్ చేసి సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయం ఆరుగంటలకు సహాయక బృందాలు వచ్చి..రాజేష్‌ను, తన అక్క బిడ్డలను ఆరిలోవ ఎంబీ ఆసుపత్రి చేర్చాయి.
చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన రాజేష్‌ను.. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి జాబితాలో చేర్చి ప్రభుత్వ సహాయం లక్ష రూపాయలు ఇచ్చేందుకు అర్హుడిని చేసారు. కానీ చెక్కు ఇచ్చే సమయంలో లక్ష రుపాయలు ఇవ్వలిసిన అధికారులు. 75వేలు ఇచ్చి ..మిగిలిన 25వేలు... ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంలోనూ అధికారులు ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఎల్జీ పాలిమర్స్ అభ్యర్థనపై కోర్టుదే తుది నిర్ణయం'