లాక్‌డౌన్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో రెచ్చిపోతున్నారు. ప్రజలకున్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. దిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఈ హైటెక్ దందా విజయవాడలో వెలుగుచూసింది.
మార్కెట్‌లో ప్రస్తుతం ఎన్-95 మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. చాలాచోట్ల అసలు లభ్యతే లేదు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన ఇచ్చారు. తక్కువ ధరకే ఎన్-95 మాస్క్‌లు అందజేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. ఇది చూసిన విజయవాడకు చెందిన కొంతమంది వైద్యులు ప్రకటనలోని నెంబర్‌కు ఫోన్ చేశారు. అడ్వాన్స్‌గా కొంత నగదు చెల్లించాలని, సరకు డెలివరీ అయ్యాక మిగిలిన సొమ్ము చెల్లించాలని నిందితులు చెప్పారు. దీంతో విడతలవారీగా మూడు లక్షల రూపాయలను నిందితుల ఖాతాలో వైద్యులు జమ చేశారు. రోజులు గడిచినా మాస్క్‌లు రాకపోవటంతో దిల్లీలోని సదరు అడ్రస్‌కు వెళ్లిన వైద్యునికి అక్కడా ఎవరూ కనిపించలేదు. విజయవాడకు వచ్చిన వెంటనే తమకు జరిగిన మోసంపై మాచవరంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఖాతాను ఫ్రీజ్ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇటువంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యసేతు యాప్ ద్వారానే సమాచారం తెలుసుకోవాలని పోలీసులు సూచించారు.
కరోనా పాజిటివ్ కేసులను ట్రాక్ చేసేందుకు తమ దగ్గర యాప్ ఉందని ప్రచారం చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ-మెయిల్‌కు స్పామ్ మెస్సేజ్‌లు పంపించి కంప్యూటర్‌లో సమాచారాన్ని హ్యాక్ చేస్తున్న ఘటనలూ వెలుగుజూస్తున్నాయి. బిట్ కాయిన్ల రూపంలో లక్షల రూపాయల నగదు చెల్లించకపోతే సమాచారాన్ని ఇచ్చేది లేదని నేరగాళ్లు బెదిరిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఓ బీటెక్ విద్యార్థి మెయిల్‌లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్‌లో ఉంచుతామని బెదిరించారు. మరికొందరు నేరస్థులు... ఆర్మీ అధికారుల పేరుతో ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకే వాహనాలు అమ్ముతామని పేటీఎం, గూగుల్‌పే ద్వారా నగదు బదిలీ చేయించుకుంటున్నారు. నగదు అందగానే ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు.ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి సమాచారమైనా ఆన్‌లైన్‌లో ఎవరితోనూ పంచుకోవద్దని సైబర్ పోలీసులు సూచించారు.
ఇవీ చదవండి