రాష్ట్రంలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం ఇచ్చే తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. ఈ విషయంలో ఎవరూ పంతాలు, పట్టింపులకు వెళ్లొద్దని హితవు పలికారు. స్థానిక ఎన్నికలను అడ్డుకోవటానికి ప్రభుత్వం చెబుతున్న కరోనా వాక్సిన్ పంపిణీ అనేది ఒక కుంటి సాకు మాత్రమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరినే..ఉద్యోగ సంఘాలు తీసుకున్నాయన్నారు.
అమెరికాలో ఎక్కువ మంది కరోనా బారిన పడి చనిపోయారని..,అయినా అక్కడ ఎన్నికలు జరిగిన విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోని 90 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని అంటున్న వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు భయపడుతుందో చెప్పాలన్నారు.
ఎన్నికలకు అధికారులు సహకరించాలి
విజయనగరంలో రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రామకృష్ణ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా రైతు పరేడ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై మాట్లాడుతూ..ఎన్నికల నిర్వహణకు అధికారులు సహకరించాలన్నారు. ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేసి ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీచదవండి: సిద్ధంగా ఉన్న అధికారులతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: వెంకట్రామిరెడ్డి