CPI Ramakrishna on Elections in AP: సీఎం జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 7న జగన్ అత్యవసరం క్యాబినెట్ మీటింగ్ అంటున్నారని.. ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామని రామకృష్ణ అన్నారు. విశాఖలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు జగన్ వెళితే ముందే పోతాడని విమర్శించారు. ఐటీ రంగం కోసం మాట్లాడితే.. జగన్ ప్రభుత్వం ఉరేసుకోవాలని.. 0.14 శాతమే ఐటీ ఎగుమతులే ఏపీ చేసిందని రామకృష్ణ ఆరోపించారు.
తెలంగాణ కంటే ఏపీ ఐటీ ఎగుమతులు చాలా చాలా తక్కువని.. నాలుగు సంవత్సరాలలో జగన్ రాష్ట్రాన్ని దివాలా చేసి.. అప్పుల పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా బూటకమని.. జగన్ మాటలు అన్ని అవాస్తవాలేనని పేర్కొన్నారు. ఏ రంగంలోనూ అభివృద్ధి జరగలేదు.. కానీ సొంత మీడియాలో మాత్రం చాలా బాగా అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. స్వప్రయోజనాల, కేసులు కోసమే జగన్ దిల్లీ వెళుతున్నారని రామకృష్ణ ఆరోపించారు.
అమరావతిని కిల్ చేశారని.. అమరరాజా కంపెనీపై వేధింపులు పాల్పడి రాష్ట్రం నుంచి పంపారని.. కియా, జాకీ పరిశ్రమలకీ ఇదే పరిస్థితని అన్నారు. దమ్ముంటే వైసీపీ నేతలు నాలుగు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అలాగే వివేకా హత్య కేసుపై మాట్లాడుతూ.. వివేకా కేసును మూడేళ్లు విచారణ చేయడానికి సీబీఐకి సిగ్గు ఉండాలని.. మోదీ, అమిత్ షా చేతిలో సీబీఐ కీలు బొమ్మని ఆరోపించారు. సీబీఐకి విలువ లేకుండా అవినాష్ రెడ్డిని చేశారని అన్నారు. సోము వీర్రాజు సిగ్గు లేకుండా ఏపీకి కేంద్రం చాలా ఇచ్చిందని చెపితే.. వైసీపీ, టీడీపీ మాట్లాడడం లేదని అన్నారు. మోదీ, అమిత్ షా అంటే భయపడుతున్నారని అన్నారు.
"సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్దామనుకుంటున్నాడు. క్యాబినెట్ సమావేశంలో కూడా ముందస్తు ఎన్నికల గురించి చర్చించనున్నారు. అదే జరిగితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతోందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయన ముందస్తుకు పోతే ముందుగానే ఇంటికి పోతాడు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఓడిపోవడం ఖాయం. జగన్‌ని ఓడించడానికి ప్రజలు కూడా సిద్ధమైపోయారు. తాజాగా మహానాడులో చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలతో కూడా క్లారిటీ వచ్చింది. 2019లో సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే జగన్‌కు ప్లస్‌గా ఉంది.. ఇప్పుడు చంద్రబాబు కూడా సంక్షేమ పథకాలు పెడతామంటున్నారు కాబట్టి ఇక జగన్ కూడా ఓడిపోతాడు. కాబట్టి ముందస్తు ఎన్నికలు పెడితే మంచిది"-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి