'ఆసుపత్రిలో కొవిడ్ పై జరిగే యుద్ధం చాలా వింతగా ఉంటుంది. అసలు ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరి అయ్యే వారు కొందరైతే. లోపల వైరస్‌తో యుద్ధం చేస్తూ బయటకు హాయిగా కనిపించే వారు ఇంకొందరు' అని చెబుతున్నారు యువ పాత్రికేయుడు కె. అనిల్ బాబు. కొవిడ్ బారిన పడిన ఆయన... ఇటీవల కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. ఆసుపత్రిలో తనకు ఎదురైన అనుభవాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
'కొవిడ్ బారిన పడకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకున్నా. అయినా ఆ మహమ్మారికి చిక్కక తప్పలేదు. ఓ వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. ఆసుపత్రిలో కొవిడ్‌పై జరిగే యుద్ధం చాలా వింతగా ఉంటుంది. అసలు ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరి అయ్యే వారు కొందరైతే. లోపల వైరస్‌తో యుద్ధం చేస్తూ బయటకు హాయిగా కనిపించే వారు ఇంకొందరు. ఇందులో చాలా మందికి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందిపై ఎక్కడ లేని అసంతృప్తి ఉంటుంది. ఇక్కడ నర్సులు, డాక్టర్లది తప్పు అనలేం. అలాగని అనారోగ్యంతో ఇబ్బంది పడే రోగిదీ తప్పు అనలేం. చికిత్స అందించడం వైద్య సిబ్బంది ప్రాథమిక బాధ్యత అయితే... ఆ చికిత్సకు స్పందించేలా రోగికి మానసిక స్థైర్యం కల్పించడం తోటి రోగుల కనీస బాధ్యత. ఈ స్పృహ కొరవడి చాలా మంది తోటి కొవిడ్ రోగులను వివక్షతో చూస్తుంటారు. వారి వస్తువులు తాకితే తమకు ఏదో కొత్తగా కొవిడ్ వస్తుందన్నట్లు ఫీలవుతుంటారు. అంతా వైద్య సిబ్బందే చేయాలని వారు అనుకుంటారు.
తోటి కొవిడ్ రోగులు పడుతున్న అవస్థను కనీసం పట్టించుకోవాలి. నిజానికి అత్యధిక శాతం మంది విషయంలో మందుల కంటే ఎక్కువ ప్రభావం చూపించే దివ్యౌషధం చక్కని పలకరింపు. కొవిడ్ కంటే ఒంటరితనం భయంకరంగా ఉంటుంది. ఆసుపత్రి బయట తమ వారు పడిగాపులు కాస్తున్నా... లోపలికి వెళ్లాక తమను పలకరించే వారు లేకపోతే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే అపోహలను విడిచి పెట్టి స్నేహ హస్తం అందించాల్సిన సమయం ఇది. రోగి నుంచి రోగికి జరిగే హాని ఏమీ ఉండదని గుర్తించాలి.
కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరినంత మాత్రాన ప్రతి ఒక్కరూ మంచానికి అతుక్కుపోవడం తప్పని సరి ఏమి కాదు. ఏ మాత్రం ఓపిక ఉన్నా కొవిడ్ ఆందోళనలో ఉన్న వారిని పలకరించండి. అది వారికి ఎంతో ఊరట ఇస్తుంది. ఈ వ్యాధిని అధిగమించడంలో సహకరించండి. అప్పుడు నిజమైన కొవిడ్ యోధులం కావచ్చు'
తాను డిశ్ఛార్జి అయ్యే సమయానికి పది మంది మనసులకు చేరువైనట్టు పాత్రికేయుడు అనిల్ వెల్లడించారు. కష్టంలో కూడా వారి ముఖంలో నవ్వు చూడడం ఎంతో సంతృప్తిని కలిగించిందని వెల్లడించారు.