Haryana CM Manohar lal khattar at Vishaka: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖలోని పెమా వెల్‌నెస్ రిసార్ట్‌లో భేటీ అయ్యారు. ఖట్టర్ ఈ నెల 15నుంచి ఈ రిసార్ట్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, జ్ఞాపిక బహుకరించి దుశ్శాలువాతో జగన్ సన్మానించారు. సుమారు గంటపాటు ఆయనతో మాట్లాడారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమరనాథ్, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ గొలగాని హరివెంకటకుమారి తదితరులు ఉన్నారు. ఉదయం 11.40 గంటలకు విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి సాయంత్రం 3.15 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి విజయవాడ వెళ్లారు. తొలుత విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఉపముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు అమరనాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయ వీఐపీ లాంజ్‌లో సీఎం వారితో పలు అంశాలపై చర్చించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తాం: డీజీపీ