CM Jagan Camp Office Shifting to Visakhapatnam: రాజధానిని అధికారికంగా విశాఖపట్నానికి మార్చేందుకు హైకోర్టు తీర్పు అడ్డంకిగా మారడంతో.. సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు, వివిధ శాఖల కార్యాలయాల్ని ప్రభుత్వం అక్కడ దొడ్డిదారిన ఏర్పాటు చేయబోతోంది. తాత్కాలిక వసతి పేరుతో వివిధ శాఖల కార్యాలయాల్నీ విశాఖలో ఏర్పాటు చేయబోతోంది.
అందుకు అవసరమైన భవనాల్ని గుర్తించేందుకు గాను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, సాధారణ పరిపాలనశాఖ సర్వీసెస్ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్‌లతో కూడిన కమిటీని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ తక్షణం చర్యలు తీసుకుని, సాధారణ పరిపాలన శాఖకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు సహా ప్రభుత్వ కార్యాలయాలు వేటినీ తరలించేందుకు వీల్లేదని.. 2022 మార్చిలో హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో విశాఖకు కార్యాలయాలు మారిస్తే కోర్టు ధిక్కరణ నేరం అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం.. ఉత్తరాంధ్ర వెనుకబాటును తెరపైకి తెచ్చి, దాని అభివృద్ధి ముసుగులో దొడ్డిదారిన విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
దీనిపై తొలుత మంగళవారం జీవో నం.2004 విడుదల చేసింది. ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, రవాణా అనుసంధానత తదితర అనేక రంగాల్లో ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడి ఉందని, అందుకే అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, ప్రత్యేక అధికారులు నిత్యం ఆ జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణ, సమీక్ష నిర్వహించాలని ఆదేశించింది.
CM Camp Office At Visakha: విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై కమిటీ
మంగళవారం ఇచ్చిన జీవోకి కొనసాగింపుగా ప్రభుత్వం బుధవారం జీవో నెం 2015 విడుదల చేసింది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ఆయా జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు, రాత్రి పూట బస చేసినప్పుడు.. సంబంధిత శాఖల అధికారులూ అందుబాటులో ఉండాలని తెలిపింది.
ఆయా శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు, జిల్లా అధికారులతో సమీక్షించి, అక్కడ తీసుకున్న నిర్ణయాల్ని క్షేత్రస్థాయి అధికారులకు వేగంగా చేరవేసేందుకు సీఎం విశాఖపట్నంలో మకాం చేయాల్సి ఉంటుందని.. ఆ ఏర్పాట్లు చూసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చాక.. అక్కడి నుంచి వచ్చిన ఉద్యోగులకు గత ప్రభుత్వం ఉచిత నివాస వసతి కల్పించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తోంది. అలాంటివారి వివరాలన్నిటినీ సాధారణ పరిపాలనశాఖ తాజాగా సేకరించింది. ఆ ఉద్యోగులకు ఉచిత నివాస వసతిని 2024 జూన్ 26వ తేదీ వరకు ప్రభుత్వం ఇది వరకే పొడిగించింది. సీఎం క్యాంపు కార్యాలయం సహా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్ని విశాఖలో ఏర్పాటు చేసే క్రమంలో.. ఈ ఉద్యోగులకు అక్కడ వసతి కల్పించేందుకే వివరాలు సేకరించారా అని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.