CLASSICAL DANCER LIKITHA : చిన్నప్పుడే నృత్యం మీద మనసు పారేసుకుంది. ఇంట్లో వాళ్లని కాదని నేర్చుకుంది కూడా. ఇంతలో అనుకోని ప్రమాదం. ‘నాట్యాన్ని కొనసాగిస్తే ముప్ప’న్నారు వైద్యులు. కానీ పీసపాటి లిఖిత భయపడలేదు. కఠోర శ్రమ, ఆత్మ విశ్వాసాలతో అటు చదువు, ఇటు నాట్యం... కొనసాగించింది. మేకులపై అతి కష్టమైన నృత్య ప్రక్రియతో అబ్బురపరచింది. ఆమె తన గురించి వివరించిందిలా..
మాది వైజాగ్. నాన్న పీబీవీ స్వామి రామాలయంలో పనిచేస్తారు. అమ్మ విజయలక్ష్మి. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు సంగీత పాఠశాలలో చేర్చారు. నన్నేమో దగ్గర్లోని నృత్యాలయం నుంచి వినిపించే తాళం, అడుగుల శబ్దాలు ఆకర్షించాయి. ఇంట్లో కూచిపూడి నేర్చుకుంటానని అడిగా. ‘అమ్మాయిలు వేదికలెక్కి నృత్యాలు చేస్తుంటే నలుగురూ ఏమనుకుంటారు’ అన్నారు.
నాకేమో మనసంతా దానిపైనే! ఓరోజు వెళ్లి చేరిపోయా. పెద్దవాళ్లేరని అడిగితే తర్వాత వస్తారని చెప్పా. నెలయ్యాక ఫీజు కట్టాలిగా.. అడిగేశారు. సంగీత తరగతులకు ఆటో కోసమని ఇచ్చినవీ, నా అవసరాలకు ఇచ్చినవీ దాచి, వాటినే కట్టా. అనుమానమొచ్చి టీచర్ నిలదీశారు. జరిగిందంతా చెప్పా. నా ఆసక్తికి మెచ్చి ఫీజు లేకుండానే నేర్పించారు. ఇంట్లోనూ తెలిసినా నా పట్టుదల చూసి కాదనలేదు. పదకొండో ఏటనుంచే ప్రదర్శనలూ ప్రారంభించా. పదో తరగతిలో జరిగిన ఓ ఆక్సిడెంట్ అంతా మార్చేసింది. ప్రమాదంలో కాలికి గాయమైంది. డ్యాన్స్ చేయలేక ఆపేశా.
భవిష్యత్తుకు ఇబ్బందైనా...
ఎంకాం కోసం హైదరాబాద్ వచ్చా. మళ్లీ డ్యాన్స్ మీదకు మనసు మళ్లింది. అమ్మానాన్నకి భారం కాకూడదని ట్యూషన్లు చెబుతూ ఆ డబ్బులతో నేర్చుకోవడం మొదలుపెట్టా. కొద్దిసేపు కదలకుండా నిల్చొన్నా, కూర్చున్నా కాలు వాచిపోయేది. డాక్టర్ ‘నువ్విక డ్యాన్స్ చేయడం కష్ట’మన్నారు. కానీ నాపై నాకు నమ్మకం ఎక్కువ. అందుకే ‘అవని నృత్యాలయం’లో చేరా. మా గురువు డా. ఎన్.రవికుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత. మా ప్రాక్టీసు హాలంతా ఆయన పతకాలు, అవార్డులే! నాకూ మీలా సాధించాలని ఉందని చెప్పా.
‘ఆసక్తి ఉంటే చాలు.. సాధ్యమే’ అని ప్రోత్సహించారాయన. ఎన్నో థీమ్‌లనూ పరిచయం చేశారు. చివరికి ‘మేకులపై నృత్యం’ ఎంచుకున్నా. ‘విరిగిన కాలితో నృత్యమా.. భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నావ్’ అని చాలా మంది వారించారు. 9999 మేకులు.. మొదట్లో వాటిపై నిలబడటమే కష్టమైంది. గుచ్చుకొని పాదాలు రక్తం కారేవి. టీటీ ఇంజక్షన్లు తీసుకొని మరీ కొనసాగించా. మూడు నెలల శ్రమ ఫలించింది. ఈ ఏడాది 9 నిమిషాలు వాటిపై నవ దుర్గల అవతారాలను వర్ణిస్తూ నర్తించా. దానికి బోలెడన్ని అభినందనలు, పురస్కారాలు పొందగలిగా.
పీజీ తర్వాత ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా చేరా. నిల్చొని బోధన, ఇటు నృత్యసాధన.. కాలు విపరీతంగా నొప్పి పుట్టేది. సాధనలో కిందపడ్డ సందర్భాలెన్నో! అయినా ప్రయత్నం విడవలేదు. బరువంతా ఒకే కాలిపై పడకుండా మా గురువు కొన్ని ముద్రలను సూచించారు. అలా విజయం సాధించగలిగా. లా కూడా చదివేశా. గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలన్నది నా ప్రయత్నం. దాని కోసం ప్రయత్నిస్తున్నా.
‘నృత్య శిక్షణాలయం’ పెట్టాలన్నది కల. సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించడం మన బాధ్యత. అందుకే పిల్లలకు రామాయణ, భాగవత శ్లోకాలను నేర్పించే దాన్ని. అమ్మాయికి సంబంధించి ప్రతి విషయంలో అడ్డుచెప్పే వారే ఎక్కువ. అలాగని వదిలేయొద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే నిరూపించుకోవడం ఖాయం.
ఇవీ చదవండి: