విశాఖ జిల్లా కేజీహెచ్ లోని ప్రత్యేక వార్డులో వందకుపైగా బ్లాక్‌ఫంగస్ బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో ఐదుగురు మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 20 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సంబంధించిన ఔషధాల కొరత తీవ్రంగా ఉందని.. బాధితులు చెబుతున్నారు. బ్లాక్‌మార్కెట్‌లో ఒక్కో ఇంజక్షన్‌కు 7 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇలా చికిత్సకే పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందని.. అంత డబ్బులేని సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఔషధాల సరఫరా కేంద్రం నియంత్రణలో ఉండటంతో పాటు సాధారణ రోజుల్లో వినియోగం తక్కువగా ఉండటమే.. కొరతకు కారణమని వైద్యులు వివరిస్తున్నారు.
ఔషధాల లభ్యత తక్కువగా ఉందని అంగీకరించిన కలెక్టర్ వినయ్‌చంద్.. తీవ్రమైన కొరత మాత్రం లేదని అన్నారు. బ్లాక్‌ఫంగస్‌తో బాధపడుతున్న వారిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇంజక్షన్లు కావాల్సి వస్తోందంటున్న వైద్యులు.. మిగిలిన వారికి మందులతోనే నయం అవుతుందని చెబుతున్నారు. ముందుగానే భయంతో ఇంజక్షన్ల కోసం ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:Village Food Factory : గరిట పట్టాడంటే.. లక్ష్మీదేవి గలగలలాడాల్సిందే!