విశాఖ శ్రీ శారదాపీఠంలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. త్రిపురసుందరి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం ఉదయం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ..
గురువందనం చేసి మహాగణపతి పూజతో నవరాత్రి వేడుకలకు అంకురార్పణ చేశారు. అంతకుముందు పీఠాధిపతులు గోపూజ నిర్వహించి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. సాంప్రదాయబద్ధంగా శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి ఆలయంలో విశేష అభిషేకాన్ని నిర్వహించారు.
పంచామృతాలతో అభిషేకం..
పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అభిషేక సమయంలో రాజశ్యామల అమ్మవారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి చెంత కొలువుదీరి ఉన్న శ్రీ చక్రాన్ని కూడా ఈ సందర్భంగా అభిషేకించారు. అనంతరం పీఠం ప్రాంగణంలోని యాగశాలలో చండీ హోమాన్ని చేపట్టారు.
లోక కల్యాణం కోసం..
లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ నవరాత్రుల్లో ఈ యాగాన్ని తలపెట్టడం విశాఖ శ్రీ శారదా పీఠానికి ఆనవాయితీగా వస్తోంది. అలాగే సకల మానవాళికి భోగ మోక్షములు ప్రసాదించాలని ప్రార్ధిస్తూ శ్రీమత్ దేవీ భాగవత పారాయణ నిర్వహించారు. ఈ పారాయణ మహా యజ్ఞం నవరాత్రి వేడుకల్లో భాగంగా చేపట్టారు. శరన్నవరాత్రి ఉత్సవాలల్లో శ్రీమత్ దేవీ భాగవత పారాయణ వింటే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.