కుటుంబాన్ని పోషించుకొనేందుకు ఆటో నడిపే వ్యక్తి.. పేదలకు అన్నదానం చేస్తూ పెద్దమనసు చాటుకుంటున్నాడు. భూమయ్య అనే ఆటోడ్రైవర్ విశాఖలోని మానసిక రోగుల ఆస్పత్రి వద్ద ఆరేళ్లుగా నిత్యం అన్నదానం చేస్తున్నాడు. మానసిక రోగులకు ప్రభుత్వం భోజనం సమకూరుస్తుంది. వారికి సహాయంగా అక్కడే ఉండే బంధువులు, సహాయకులకు మాత్రం ఎలాంటి ఆహార సదుపాయమూ ఉండదు. పూటపూటకూ హోటళ్లలో భోంచేసే స్థోమత లేని నిరుపేదలైన వారందరికీ భూమయ్యే.. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాడు. తానే స్వయంగా ఇంటివద్ద వండి, సమయం ప్రకారం ఆటోలో తెచ్చి వారికి వడ్డిస్తాడు. రోజూ ఈ విధంగా 150మందికి పైగా ఆకలి బాధకు గురికాకుండా భూమయ్య ఆసరాగా నిలుస్తున్నాడు.
అన్నపూర్ణ నిత్యాన్నదానం పేరుతో సేవ
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన భూమయ్య పిల్లల చదువుల కోసం విశాఖకు వలస వచ్చాడు. ఆరేళ్ల క్రితం పది మందికి అన్నం పెడితే మంచిదని ఓ వృద్ధురాలు ఆయనకు సలహా ఇచ్చింది. కొంత సహాయం చేసేందుకూ ముందుకొచ్చింది. అప్పటినుంచే అన్నపూర్ణ నిత్యాన్నదానం పేరుతో భూమయ్య సేవ ప్రారంభమైంది. తర్వాత దాతల సహకారమూ తోడైంది. కొంతమంది బియ్యం పంపుతుంటే.. మరికొందరు పాత్రలు, ఇతర సామాగ్రి సమకూర్చారు. కరోనా సమయంలో ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్ డ్రైవర్లకూ భూమయ్య అన్నదానం చేశాడు.
కుటుంబసభ్యుల సహకారం
భూమయ్య అన్నదానానికి కుటుంబ సభ్యులూ చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. నిత్యం తమ ఆకలి తీర్చే ఆటోడ్రైవర్‌కు పేదలు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.
ఇదీ చదవండి: