Vishnukumar comments on Visakha MP family kidnapping: విశాఖపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో ఏదో కుట్ర కోణం దాగి ఉందని.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ నివాసానికి రౌడీ వెళ్లాడంటే ఇది సాధారణమైన విషయం కాదన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారం సినిమా కథను మించిపోయిందని ఆయన ఆరోపించారు.
కిడ్నాప్ కేసులో కుట్ర కోణం దాగి ఉంది.. రాష్ట్రంలో జరుగుతున్న కిడ్నాప్‌లు, దాడులు, అరాచకాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఈరోజు విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై, రాష్ట్ర పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చేశారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో ఏదో కుట్ర కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌పై విష్ణుకుమార్ ఆగ్రహం.. ''విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసులో ఏదో కుట్ర కోణం ఉంది. ఇది కిడ్నాప్ కాదు..సెటిల్‌మెంట్ వ్యవహారం. ఒక ఎంపీ నివాసానికే రౌడీ వెళ్లాడంటే.. ఇది సాధారణ విషయం కాదు. ఈ కిడ్నాప్ వ్యవహారం ఓ సినిమా కథను మించిపోయింది. విశాఖలో కడప, పులివెందుల బ్యాచ్‌లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సెల్‌ఫోన్ డేటా చూస్తే మెుత్తం వ్యవహారం బయటకొస్తుంది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు..?, ఈ కేసును సీబీఐ, ఎన్‌ఐఏ సంస్థలకు అప్పగించి.. విచారణ జరిపించాలి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించిన రెండు రోజుల్లోనే ఎంపీ కుటుంబం బాధితులుగా మారింది. గంజాయి మత్తులో జరిగిన ఈ అరాచకం గురించి తెలుసుకుని నివ్వెరపోవాల్సి వచ్చింది. ఎంపీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగితే.. ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు.'' అని విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ పోలీసులపై నమ్మకం లేదు.. అనంతరం ఈ ఘటన వెనుక ఎంపీ సత్యనారాయణ బయటికి చెప్పుకోలేని విషయాలు దాగి ఉన్నాయనీ, భార్య, కుమారుడు ఎక్కడ ఉన్నారో ఎంవీవీ ఎందుకు గమనించలేదనే విషయం అర్థంకావటంలేదని..విష్ణుకుమార్ రాజు సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ కుమారుడు చెబితే రౌడీషీటర్ సంతకం పెట్టకున్నా పోలీసులు వదిలేస్తారా..? అంటూ ఆయన ఆగ్రహించారు. ఏపీ పోలీసులు నిస్పాక్షికంగా విచారణ జరుపుతారన్న నమ్మకం తనకు లేదన్నారు. నిజాలు తేలాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలన్న విష్ణుకుమార్.. యూపీ మోడల్ పోలీసింగ్ అమలు చేస్తేనే రాష్ట్రంలో అరాచకాలు తగ్గుతాయనీ వ్యాఖ్యానించారు. 'ఇది కిడ్నాప్ కాదు.. సెటిల్‌మెంట్ వ్యవహారం. ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా..? లేక ఇతర కారణాలా..?' అనేది విచారించాల్సి ఉందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.