విశాఖ జిల్లాలో మన్యంతోపాటు మైదాన ప్రాంతాల్లో కలిపి 34 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. తొలిసారిగా 2018-19 లో కస్తూర్బాలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. జిల్లాలో మొదటి ఆరు కేజీబీవీలకు అవకాశం కల్పించారు. వాటి సంఖ్య క్రమేపీ పెంచుతూ వచ్చారు. విద్యా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 50 కేజీబీవీలో స్థాయిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో జిల్లాకు సంబంధించి 17 ఉన్నాయి. దీంతో జిల్లాలోని 34 విద్యాలయాల్లో ఈ ఏడాది తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోధన జరుగుతోన్న 17 కేజీబీవీలతోపాటు కొత్తగా ఉన్నతి పొందిన పాఠశాలల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించనున్నారు. కొత్తగా 680 సీట్లు భర్తీ అయ్యే అవకాశం కల్పించడంతో గ్రామీణ విద్యార్థులకు ఇంటర్ విద్య మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది.
తాజాగా వచ్చిన అనుమతుల ద్వారా ప్రతీ కేజీబీవీ లోను ఇంటర్ విద్య అందుబాటులో ఉంటుందని గతంలో వచ్చిన వాటిలో 11 చోట్ల కళాశాల భావన నిర్మాణం జరుగుతోందని మిగిలిన వాటికి త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని అంతవరకూ ఈ భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. కొత్త కళాశాలల్లో సీట్ల భర్తీకి త్వరలోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఇవీ చదవండి: