Rushikonda: విశాఖ జిల్లా ఎండాడ గ్రామ పరిధిలోని రుషికొండ రిసార్టు పునరుద్ధరణ ప్రాజెక్టుకు అనుమతులన్నీ తీసుకున్నామని, నిర్మాణంలో ఉల్లంఘనలకు పాల్పడటం లేదని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ కె.కన్నబాబు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రాజెక్టు కోసం 40 ఎకరాలను శుభ్రం చేస్తున్నట్లు పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ఆమోదిత ప్రాజెక్టు సైట్ ప్రకారం 9.88 ఎకరాల్లోనే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అందులోనూ 5.18 ఎకరాల్లోనే భవనాలను నిర్మిస్తామని, మిగిలిన భూమిలో గ్రీన్‌బెల్ట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆ ప్రాజెక్టు కోస్టల్ రెగ్యులేషన్ జోన్-2 పరిధిలోకి వస్తుందని వివరించారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై విచక్షణారహితంగా తవ్వకాలు, చెట్ల కొట్టివేతను సవాలు చేస్తూ జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ దీనిపై కౌంటరు అఫిడవిట్ వేశారు.
ఇవీ చూడండి: