అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006ను గ్రామ సభ అధికారాలను నిర్వీర్యం చేయడానికి ఉపయోగిస్తున్నారని సమతా సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు రెబ్బా ప్రగడ రవి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివాసి మిత్ర సంస్థ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటవీ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి గిరిజనులకు న్యాయ సమాచారం అందించాలని ఆయన కోరారు. గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
భూమికి బదులు మరో చోట భూమి ఏది..?
అటవీ హక్కుల చట్టం కింద లబ్ధిదారులందరికీ పట్టాలు అందలేదని ఆదివాసి మిత్ర సంస్థ అధ్యక్షుడు మన్మధరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు నష్టపోయిన వారికి మరోచోట భూమి ఇస్తామని హామీ ఇచ్చి.. నెరవేర్చలేదని గుర్తుచేశారు. చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ఎంత భూమి సాగుచేస్తే అంత భూమికి పట్టా ఇవ్వాలి..
ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు అన్యాయం చేసి, తక్కువ భూమిని ఇచ్చారని శ్రీకాకుళం జిల్లా వెలుగు సంస్థ సంచాలకుడు సంజీవరావు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులు ఎంతభూమి సాగు చేసుకుంటే అంత భూమికి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఆదివాసీ గిరిజనులతో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తాగునీటి సమస్య తీవ్రం.. ఖాళీ బిందెలతో నిరసన