Three people died: తిరుపతి జిల్లా యెర్రావారిపాలెం మండలం యలమందలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాతృదినోత్సవాన ఇద్దరు మాతృమూర్తులు.. అమ్మ అనే పిలుపుకు దూరమయ్యారు. ఎవరి భవిష్యత్తు కోసం సొంత ఇంటిని, సొంత ఊరిని వదిలి వెళ్లారో.. వారే మరణించడంతో ఆ తల్లుల పుత్రశోకం కట్టలు తెంచుకుంది. వేసవి సెలవులకు అమ్మమ్మ గ్రామానికి వచ్చిన ఇద్దరు పిల్లలు.. తాతతో పాటు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో గల నీరుగట్టువారి పల్లిలో వరలక్ష్మి రామ్మోహన్ మగ్గం కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి మణికంఠ, చరిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఇంటికి సమీపంలోనే దూరపు బంధువు ఏకాంబరం అన్నపూర్ణలో అదే మగ్గం పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి జగదీష్, ప్రవళిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. 2 సంవత్సరాల క్రితం వరలక్ష్మి ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. ఏడాది క్రితం అన్నపూర్ణ కూడా అక్కడికే వెళ్ళింది. వరలక్ష్మి కుమారుడు మణికంఠ(12) మదనపల్లిలోని బీసీ వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నాడు.
అన్నపూర్ణ కుమారుడు జగదీష్ కురబలకోట మండలం చేనేత నగర్ బీసీ వసతి గృహంలో చదువుకుంటున్నాడు. కాగా.. వేసవి సెలవులు రావడంతో మణికంఠ.. అమ్మమ్మ గ్రామమైన తిరుపతి జిల్లా యర్రవారిపాలెం మండలం యలమందకు సమీప బంధువైన జగదీష్‌తో పాటు గత మూడు రోజుల క్రితం వచ్చాడు. ఆదివారం తాత నాగమునితో పాటుగా గ్రామ సమీపంలోని గాజులఏరు డ్యామ్‌లో చేపలు పట్టడానికి వారు వెళ్లారు. అయితే తాత డ్యామ్‌లో చేపలకోసం వల వేస్తుండగా ప్రమాదవశాత్తు చేపల వలలో కాళ్లు తగులుకుని మునిగిపోయాడు.
గట్టుపై ఉండి ఇది గమనించిన మణికంఠ, జగదీశ్ ఇద్దరూ తాతను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు విఫలమై కేకలు వేస్తూ.. నీట మునిగారు. సమీపంలో ఉన్న వ్యవసాయదారులు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వారు మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మణికంఠ తల్లి వరలక్ష్మి, జగదీశ్ తల్లి అన్నపూర్ణ బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు యెర్రావారిపాలెం పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: