Accidents on Tirumala Ghat Road : తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రమాదాలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించి.. నివారణకు పూనుకుంది. తిరుమలకు సంబంధించి రెండు ఘాట్ రోడ్లలో డ్రైవర్ల నిర్లక్ష్యం, రోడ్డుపై అవగాహన లేకపోవటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు.. తిరుమల అడిషినల్ ఎస్పీ ముని రామయ్య స్పష్టం చేశారు. వాహనాలు నడుపుతూ సెల్ఫోన్లలో మాట్లాడటం, అజాగ్రత్తగా వాహనాలు నడపటం కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నాయన్నారు.
ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాలు ఇక నుంచి నిర్దేశిత సమయానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డులోని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏఎస్పీ ముని రామయ్య ప్రభుత్వ ఆర్టీవో, విజిలెన్స్, ట్రాఫిక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఘాట్ రోడ్డులోని ప్రమాదాలకు గల కారణాలను, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఇదీ చదవండి: Tirumala: తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదు: ఎస్పీ పరమేశ్వరరెడ్డి
ఘాట్ రోడ్డులో భక్తులు వాహనాలు నిలిపి ఫొటోలు, సెల్ఫీలు వంటివి తీసుకోవటం కూడా ప్రమాదాలకు ఓ కారణమేనని ఏఎస్పీ ముని రామయ్య తెలిపారు. వాహనాలు ఫిట్నెస్ లేకుండా ఘాట్ రోడ్డులోకి రావద్దని.. రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్డులో వాహనాలు నడిపే డ్రైవర్లకు లైసెన్సులు తప్పనిసరి అని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే ప్రయాణికులు తగిన విశ్రాంతి తీసుకున్న తర్వాతే.. ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలని సూచించారు. అలిపిరి వద్ద ప్రత్యేక బృందాలు ఫిట్నెస్ను పరిశీలించిన తర్వాతే ఘాట్ రోడ్డులోకి అనుమతి ఉంటుందని తెలిపారు.
ప్రమాదల నివారణ చర్యలలో భాగంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అమలులో ఉన్న వేగ పరిమితిని మళ్లీ అమలులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. వాహనాదారులు దీనిని గమనించాలని.. వాహనాల వేగంలో పరిమితిని పాటించాలని సూచించారు. ఫాస్ట్‌ట్రాక్ అనే విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురాబోతున్నామని అన్నారు.
" ప్రమాదల నివారణ చర్యలలో భాగంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నాము. గతంలో అమల్లో ఉన్న వేగ పరిమితిని తిరిగి అమలులోకి తీసుకువస్తున్నాము. వాహనదారులు వేగంలో పరిమితిని పాటించాలి." -ముని రామయ్య, ఏఎస్పీ
ఇవీ చదవండి :