Ttd Chairman: సులభ్ కార్మికులు సమ్మెకు దిగడం సమర్థనీయం కాదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి వినాయక నగర్ క్వార్టర్స్‌లో తితిదే ఉద్యోగుల కోసం 1.40 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు.
నకిలీ వెబ్ సైట్లు, నకిలీ ఆధార్ కార్డులతో శ్రీవారి దర్శనాలు చేయించే వారిపై తితిదే విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించడంతో పాటు.. వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. కాగా సులభ్ కార్మికులు.. వారి సమస్యలను సంస్థ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని అన్నారు. వారు ఇలా ఆకస్మికంగా సమ్మెకు దిగి భక్తులకు ఇబ్బంది కలిగించడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. సులభ్ కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సమ్మెను విరమించి విధులకు హాజరైతే సులభ్ యాజమాన్యంతో చర్చిస్తామని ఆయన అన్నారు.
"తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. నకిలీ వెబ్ సైట్లు, నకిలీ ఆధార్ కార్డులతో క్రియేట్ చేసి.. శ్రీవారి దర్శనాలు చేయించే వారిపై మా తితిదే విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించడంతో పాటు.. వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నాము. కాగా సులభ్ కార్మికులు సమ్మెకు దిగడం సమర్థనీయం కాదు. సులభ్లో పనిచేసే కార్మికులు అవుట్ సోర్సింగ్ కిందకు వస్తారు. వారు డైరెక్టుగా మా టీటీడీకి సంబంధించిన ఉద్యోగులు కాదు. సులభ్ కార్మికులు.. వారి సమస్యలను సంస్థ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి." - వైవీ సుబ్బారెడ్డి, తితిదే ఛైర్మన్
కాగా తితిదేలో పని చేస్తున్న సులభ్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 24న సమ్మెకు దిగారు. దాదాపు 1600 మంది సిబ్బంది నిరసన బాట పట్టారు. తిరుమలలో విధులను బహిష్కరించి.. తిరుపతిలోని హరేరామ, హరేకృష్ణ మైదానంలో ఆకస్మిక సమ్మెకు దిగారు. తమను తితిదే నిర్వహణలో ఉన్న కార్పొరేషన్లో విలీనం చేయాలని సులభ్ కార్మికులు కోరారు. ఇలా వివిధ కారణాలను చూపుతూ.. గతంలో వస్తున్న జీతంలో కూడా కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. కార్మికుల సమ్మె కారణంగా తిరుమలలో పారిశుద్ధ్యం చేసేవారు లేక చెత్త భారీగా పేరుకుపోయింది. దీంతో ఆలయానికి విచ్చేసే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
ఇవీ చదవండి: