పట్టణ ప్రాంత పేద ప్రజల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గృహ సముదాయాల్లో కనీస వసతులు కరవవుతున్నాయి. తిరుపతిలో పేదప్రజల కోసం 2015లో...84 కోట్ల వ్యయంతో రేణిగుంట సమీపంలో వికృతమాల వద్ద గృహసముదాయ నిర్మాణాలు చేపట్టారు. 35 ఎకరాల విస్తీర్ణంలో 1800 ఇళ్లు నిర్మించారు. 2 కమ్యునిటీ భవనాలు, రెండు పాఠశాలలు, పార్క్.. ఇలా అత్యంత నివాసయోగ్యంగా ఉండేలా గృహసముదాయాన్ని నిర్మించారు. 2018 నాటికి పూర్తికాగా.. 2019లో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లు కేటాయించారు.
అద్దె ఇళ్లలో ఉంటున్న పేదలు....... సొంతింటి కల నెరవేరిందన్న ఆనందంతో వికృతమాల గృహ సముదాయంలో చేరిపోయారు. లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించడంతో... తమ పని పూర్తయిందని నగరపాలక సంస్థ అధికారులు భావించారు. భవనాలు నిర్మించడంతో బాధ్యత తీరిందని గృహనిర్మాణ శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారు. అయితే పూర్తిగా వసతులు కల్పించకుండానే రెండు శాఖలు పక్కకు తప్పుకోవడంతో లబ్ధిదారులకు తలనొప్పిగా మారింది. ఎడాపెడా విద్యుత్ కోతలు, తాగునీటితో సతమతవుతున్నారు. నగర శివారులో ఉండటంతో రవాణా సౌకర్యం లేక ఇక్కట్లు పడుతున్నారు. పిచ్చి మొక్కలు పెరిగి.. పాములు, పురుగులు బెడద ఎక్కువైందని లబ్ధిదారులు వాపోతున్నారు.
కమ్యునిటీ భవనాలు, పాఠశాలలు నిర్మించిన అధికారులు వాటి నిర్వహణ గాలికొదిలేశారు. ఇళ్లు కేటాయిస్తే సరిపోదని..మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరముందని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: అదీ ఉపాసన రేంజ్ అంటే.. అత్యంత ఖరీదైన కారు కొనుగోలు.. ఎంతంటే?