TDP MLC ASHOK BABU FIRE ON YCP GOVERMENT: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, అరాచకాల వల్ల ప్రజలు, యువత విసిగిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, జీవనోపాధి దొరకక రోజురోజుకి నిరుత్సాహ పడుతున్నారని గుర్తు చేశారు. నేడు తిరుమలలో వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సమాజంపైన వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దాడి చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులపై, ఆయా పార్టీల కార్యకర్తలపై నిరంతరంగా దాడులు చేస్తూ, పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ దాడులపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులు కలిశారని అన్నారు.
ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరుపున మేము వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచారం ప్రారంభించాం కాబట్టి ఆ దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమలకి రావడం జరిగింది. ఆ ముగ్గురి అభ్యర్థులకు శ్రీవారి ఆశీర్వాదం మెండుగా ఉండాలి. ఈ మూడు నియోజకవర్గాలో టీడీపీకి చాలా అనుకూలత ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీడీపీనే గెలుస్తుందని పూర్తి నమ్మకం ఉంది.- అశోక్ బాబు, టీడీపీ ఎమ్మెల్సీ
ఇవీ చదవండి