TDP Leaders Visit skill Development Centers: స్కిల్ ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయని అసలు నైపుణ్యాభివృద్ధి కార్యాలయాలే ఏర్పాటు చేయలేదన్నది మంత్రులు, వైసీపీ నేతల ఆరోపణ. ఈ కేసులోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కేసులు పెట్టి ప్రభుత్వం జైలుకు పంపింది. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే ప్రభుత్వం చేస్తోంది తప్పుడు ఆరోపణలని, చంద్రబాబుపై పెట్టిన కేసులు తప్పుడు కేసులేనని తెలిసిపోతుంది. తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రంలోని కోట్లాది రూపాయల విలువైన యంత్ర పరికరాలు, కంప్యూటర్లు , మౌలిక వసతులే ఇందుకు నిదర్శనమని తెలుగుదేశం బృందం తెలిపింది.
టీడీపీ హయాంలో సీమెన్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఏ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తే యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో నెలకొల్పిన సీమెన్స్ కేంద్రంలోనే 10కోట్ల రూపాయల విలువైన యంత్రాలు, కంప్యూటర్లు, పరికరాలు, మౌలిక వసతులు ఉన్నాయి. 2వీల్, 4 వీల్ ఆగ్రో, కంప్యూటర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 9 వేల 654 మందికి శిక్షణ ఇచ్చినట్లు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం మేనేజర్ వేణు మాదవ్ తెలిపారు. వీరిలో చాలామందికి ఉద్యోగాలు లభించాయి. ఈ కళాశాలలో ఈ కేంద్రాన్ని కొనసాగించి ఉంటే మరో 15 వేల మందికి నైపుణ్య శిక్షణ అందేది. గత ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి నిరుద్యోగులకు శిక్షణ అందించారు.
కళాశాలలో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏదైనా డిజైన్‌ను సాప్ట్‌వేర్‌లో రూపొందించి సీఎన్‌సీ యంత్రానికి అనుసంధానిస్తే కావాల్సిన ఆకారంలో వస్తువు రూపొందించే ఆధునాతన సాంకేతిక వ్యవస్థ ఇక్కడ ఉంది. సీమెన్స్ సంస్థ సాప్ట్‌వేర్ అద్భుతంగా పనిచేస్తున్నట్లు తెలుగుదేశం బృందం తెలిపింది. విద్యార్థులకు అందించిన నైపుణ్య శిక్షణ గురించి కళాశాల సిబ్బంది వివరించారు. ఇక్కడ శిక్షణ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు. త్యుత్తమ సాప్ట్‌వేర్, కోట్లు విలువ చేసే సామాగ్రి కళ్లముందు కనిపిస్తున్నా వైసీపీ ప్రభుత్వం అవినీతి చోటుచేసుకుందని చెప్పడం సిగ్గుచేటని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.
శిక్షణ కేంద్రాలు అర్థాంతరంగా మూసివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే ఈ కేంద్రాలను మూసివేయడం వైసీపీ రివర్స్ పాలనకు అద్దంపడుతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం పాటుపడ్డారని అన్నారు. 6 ఇంజనీరింగ్ , 34 పాలిటెక్నీక, అడిషనల్ సెంటర్స్ ఏర్పాటు చేశారని.. పరికరాలు, జీతాలు ఇచ్చి కార్పొరేషన్ విజయవంతంగా నిర్వహించారని సొమిరెడ్డి తెలిపారు. సీమేన్స్ కోట్లు విలువ చేసే మెటీరియల్ సప్లయ్ చేసిందని చూపించారు. చంద్రబాబును జైల్లో పెట్టిన ఈ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు.