Purandeswari Comments on Tirumala Funds Utilization: తిరుమల నడక మార్గంలోని అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే పురాతన రాతి మండప పునర్నిర్మాణం భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. బీజేపీ చేపట్టిన 26 జిల్లాల పర్యటనలో భాగంగా ఆమె తిరుపతిలో పర్యటిస్తున్నారు. తిరుపతిలోని కచ్ఛపీ కళాకేత్రం వేదికగా బీజేపీ శక్తికేంద్ర ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
తిరుపతి అభివృద్దికి శ్రీవారి నిధులు: తిరుమలలోని పార్వేట మండపాన్ని సంపూర్ణంగా తొలగించి ఇష్టానుసారం నిర్మించారని పురందేశ్వరి ఆరోపించారు. అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే పురాతన రాతి మండపాన్ని పునర్నిర్మించాలన్న తితిదే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తిరుపతి అభివృద్దికి తిరుమల శ్రీవారి నిధులు కేటాయించడం సరైన చర్య కాదని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్ధకు పన్నుల ద్వారా వచ్చే నిధులు ఎక్కడికి పోతున్నాయని పురందేశ్వరి ప్రశ్నించారు. నగరంలోని రైల్వేస్టేషన్ అభివృద్ది పనులను పరిశీలించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల మండపంలోని గోశాలలో గోపూజ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలోని ఆలయాల్లో దూపధీప నైవేద్యానికి నిధులు కేటాయింపును పునరుద్ధరించాలన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అనేక వాగ్దానాలపై: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లైనా నిర్మించిందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కట్టిన మూడు లక్షల టిడ్కో ఇళ్ల పేదలకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరైనది కాదన్నారు. ఇళ్ల నిర్మాణం, రోడ్లు, ప్రాజెక్టులు చూస్తే ఎంతో దుర్భరంగా ఉన్నాయన్నారు. అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించిన గేటు కొట్టుకుపోతే మరమ్మతులు కూడా చేయలేదన్నారు. రాయలసీమకి సంబంధించి గండికోట నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి అనేక వాగ్దానాలు చేసి... అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానాలు అన్నింటిని తుంగలో తొక్కారని విమర్శించారు.
తిరుమలలోని పార్వేట మండపాన్ని సంపూర్ణంగా తొలగించి ఇష్టానుసారం నిర్మించారు. అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే పురాతన రాతి మండపాన్ని పునర్నిర్మించాలన్న తితిదే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. తిరుపతి అభివృద్ది కోసం తిరుమల శ్రీవారి నిధులు ఒక్క శాతం కేటాయించారు. తిరుపతి నగరపాలక సంస్ధకు పన్నుల ద్వారా వచ్చే నిధులు ఎక్కడికి పోతున్నాయి. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లైనా నిర్మించిందా..? అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించిన గేటు కొట్టుకుపోతే మరమ్మతులు కూడా చేయలేదు. -పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు