Yuvagalam padayatra : నారా లోకేశ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుచానూరు సమీపంలోని రాత్రి విడిది కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. భవన నిర్మాణ కార్మికులతో తిరుపతి నగరంలో నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి పై ఆరోపణలు చేశారంటూ నిరసనకు దిగారు. ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అడుగడుగునా ఘన స్వాగతం.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 28వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు యువత, మహిళలతో సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరుచానూరు సమీపంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగున ప్రజలు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలుకుతూ సంఘీభావం తెలిపాయి. పాదయాత్రలో భాగంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని లోకేశ్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్ధప్రసాదాలను అందజేశారు. తిరుచూనూరు దర్శనానంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర సాగుతోంది.
జగన్ రెడ్డి పాలనలో ఇసుక దొరకదు.. ఇక.. పాదయాత్రలో భాగంగా నిన్న తిరుపతికి చేరుకున్న లోకేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వారి సమస్యలను మంత్రి పట్టించుకున్నారా? అని ప్రశ్నలు సంధించారు. జగన్ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడుతోంది భవన నిర్మాణ కార్మికులేనని మండిపడ్డారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో లోకశ్ ముఖాముఖి నిర్వహించారు. అధికారంలోకి వస్తే.. అద్భుతమైన ఇసుక విధానం తీసుకువస్తానని చెప్పిన జగన్.. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు. కార్మికుల ఆరోగ్య బీమాను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఇసుక దొరకదని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర వెయ్యి రూపాయలు ఉంటే.. జగన్ పాలనలో రూ.5వేలకు చేరిందని తెలిపారు. సిమెంట్ ధరలు జగన్ పాలనలో 60 శాతం అధికమయ్యాయని మండిపడ్డారు.
ఇవీ చదవండి :