Nara Lokesh Padayatra: గజిని సీఎం రాజధానిపై ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 22వ రోజు యువగళం పాదయాత్ర సత్యవేడు నియోజకవర్గం బైరాజు కండ్రిక విడిది కేంద్రం నుంచి ప్రారంభమై శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొత్తకండ్రిగ, శివనాథ పురం, రాజీవ్ నగర్, రామచంద్రాపురం వరకు పాదయాత్ర సాగింది. రాజీవన్ నగర్లో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ళను లోకేశ్ పరిశీలించారు. అనంతరం రామచంద్రాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మతి మరుపునకు, గజినీకి మారుపేరు జగన్ అని ఎద్దేవా చేశారు. గజిని సీఎం పబ్లిసిటీలో పీక్.. అసలు విషయంలో వీక్ అంటూ విమర్శించారు.
పోలీసులకు జగన్ బంపర్ ఆఫర్: అప్పర్ తుంగభద్ర డాం కడుతుంటే వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎగువ భద్ర పూర్తి అయితే రాయలసీమ పూర్తిగా ఎడారిగా మారిపోతుందన్నారు. యువగళం దెబ్బకు జగన్కు జ్వరం వచ్చిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. తమ పాదయాత్ర కార్యక్రమాన్ని అడ్డుకునే పోలీసులకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు. శ్రీకాళహస్తిశ్వరుని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వకపొవడం దారుణమన్నారు. సాగనిస్తే పాదయాత్ర.. లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు. జగన్కు భయమెంటో చూపిస్తానని... అమూల్ బేబీకి తాను యముడినని ఎద్దేవా చేశారు. తన మైకు లాగేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 31 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదని.. సీఎం గజిని కాబట్టి మర్చిపోయారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఆంక్షలపై స్పందించిన ఎస్పీ పరమేశ్వర రెడ్డి: లోకేశ్ పాదయాత్రకు ఎక్కడా ఆంక్షలు విధించలేదని... శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలోనే మాఢవీధుల్లో పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఎపిఎస్ఎల్ పిఆర్ బి ఎస్.ఐ. ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్ పాదయాత్రపై ఆయన స్పందించారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడా మోహరించలేదని... శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం జిల్లావ్యాప్తంగా 1200 మందిని బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. లోకేశ్ పాదయాత్రకు 350 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: