Nara Bhuvaneshwari Visit to Tirumala : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన తరువాత నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఊహించని రీతిలో రసవత్తరంగా సాగుతున్నాయి. ఆరోజు నుంచి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి టీడీపీ కార్యకర్తల్లో మనోదైర్యాన్ని నింపుతూ ప్రజలతో ఉంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టు వార్తతో మృతి చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కుటుంబాలను పరామర్శించేందుకు "నిజం గెలవాలి" పేరిట బస్సు యాత్రకు భువనేశ్వరి సిద్ధమయ్యారు.
Bhuvaneswari Nijam Gelavali Yatra Starts From Tomorrow : చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లు ఏదైనా యాత్రలు చేపట్టిన తరువాత మొదటగా దర్శించుకునేవారు. అదే విధంగా నారా భువనేశ్వరి కూడా "నిజం గెలవాలి" పేరిట చేపడుతున్న బస్సు యాత్ర విజయవంతం కావాలని ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన స్థానికులు, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని ఆలయానికి దూరంగా పంపించారు. శ్రీవారి దర్శనం అనంతరం భువనేశ్వరి నారావారిపల్లెకు చేరుకున్నారు. నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద భువనేశ్వరి పూజలు నిర్వహించారు.
TDP Nijam Gelavali Program: 'నిజం గెలవాలి' పేరుతో ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి
భువనేశ్వరి పర్యటన వివరాలు : రేపటి నుంచి చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరీ పరామర్శిస్తారు. అందులో భాగంగా మూడు రోజులు తిరుపతి జిల్లాలో పర్యటన చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి పర్యటన ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొదటగా బాబు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన టీడీపీ కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఈ నెల 26వ తేదీ అగరాలలో మహిళలతో, అలాగే అదేరోజు మహిళా ఆటో డ్రైవర్లతో నారా భువనేశ్వరి సమావేశం కానున్నారు. 27న శ్రీకాళహస్తిలో మహిళలతో ఆమె సమావేశం కానున్నారు.
నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" బస్సు యాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి తెలిపారు. భువనేశ్వరి యాత్రను విజయవంతం చేయడానికి ఆయన తిరుపతిలోని టీడీపీ వర్గాలకు దిశా నిర్ధేశం చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న తిరుపతి నియోజకవర్గం, 27న శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో పర్యటించనున్నారని తెలిపారు. యాత్రను ముగిసిన తరువాత నారా భువనేశ్వరి హైదరాబాద్ వెళ్లనున్నట్లు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వివరించారు.
డోర్ టు డోర్ ప్రచారం : ఆదివారం జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణలో ఇరు పార్టీలు మరో కార్యకమానికి శ్రీకారం చుట్టారు. నవంబరు 1న ఉమ్మడి మేనిఫెస్టో (TDP Janasena Manifesto) ప్రకటిస్తున్నట్లు నారా లోకేశ్ స్పష్టం చేశారు. అదే రోజు మేనిఫెస్టోను ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లేందుకు "డోర్ టు డోర్ ప్రచారం" కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు.