Tarakaratna funeral at Jubilee Hills Mahaprasthan: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న(40) గుండెపోటు కారణంగా 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఈ నెల 18వ తేదీన (శనివారం) మరణించారు. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆసుపత్రిలో నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారని తెలిసి.. ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి.. రాజకీయ నాయకులు, సినీ హీరోలు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు, తారకరత్న అభిమానులు నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ క్రమంలో ఆదివారం నాడు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలోని గౌతమీ కంట్రీసైడ్ విల్లాకు తారకరత్న పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయాన్ని చూసేందుకు స్థానికులు, రాజకీయ నాయకులు, బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కుటుంబ సమేతంగా విచ్చేసి.. తారకరత్న కుటుంబాన్ని పరామర్శించారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ దంపతులు, సినీ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సీనియర్ నటుడు మురళీ మోహన్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరులు తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. కడసారి తారకరత్నను చూసి కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. శంకర్‌పల్లిలోని ఆయన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లే ముందు చేయాల్సిన కార్యక్రమాలను పూర్తి చేసి, ప్రత్యేక అంబులెన్స్‌లో 9:15 గంటలకుఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు.
తారకరత్నను తరలించే అంబులెన్స్‌లో బాలకృష్ణ, ఎంపీ విజయ్ సాయి రెడ్డిలు కూడా ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లారు. సినీ నటులు, ప్రముఖుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు తారకరత్న పార్థీవ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లోనే అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్రగా బయలుదేరనున్నారు. చివరగా సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. కడసారిగా తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించడానికి టీడీపీ కార్యకర్తలు, తారకరత్న అభిమానులు, సినీ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు ఫిల్మ్ ఛాంబర్‌కు తరలివస్తున్నారు.
ఇవీ చదవండి