Misappropriation of TTD Funds: భక్తుల సౌకర్యాల పేరుతో వందల కోట్ల రూపాయల టీటీడీ నిధులను తిరుపతి నగరపాలక సంస్థకు ధారపోస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతి నగరంలో ఇబ్బందులు లేకుండా ఉండేలా ఇప్పటికే 600 కోట్ల రూపాయలతో శ్రీనివాససేతు నిర్మించారు. భక్తుల రాకపోకలకు ఏ మాత్రం సంబంధంలేని రహదారులను మరో రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. తిరుపతి నగరం వెలుపల మాస్టర్ ప్లాన్ రహదారుల్లో భాగంగా చేపడుతున్న రహదారులకు భక్తులను సాకుగా చూపుతూ నిధులు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
TTD Board of Trustees Meeting: టీటీడీ ఛైర్మన్ కరుణాకరెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. భక్తుల రాకపోకలతో ఏ మాత్రం సంబంధంలేని తిరుపతి నగరశివారు రహదారుల విస్తరణకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో రహదారులతో పాటు ఇతర నిర్మాణాలకు టీటీడీ నిధుల నుంచి దాదాపు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తూ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సిన పనులకు టీటీడీ నిధులను దారాదత్తం చేశారని విపక్షాలు మండిపడుతున్నారు. తిరుమల నుంచి వచ్చే భక్తులు సులువుగా తిరుచానూరుతో పాటు నగరం వెలుపలి జాతీయ రహదారికి చేరుకోవడానికి ప్రత్యేకంగా గరుడ వారధి నిర్మించారు. భక్తుల అవసరాలకు ఇప్పటికే గరుడవారధి అందుబాటులోకి వచ్చినా వందల కోట్ల రూపాయలు రహదారుల విస్తరణకు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
PIL in AP High Court for Fencing Tirumala Pathway: 'చేతి కర్రలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు..'
Decisions in Meeting of TTD Board of Trustees:
- భక్తులు తిరుచానూరు చేరుకోవడానికి అంటూ నారాయణాద్రి ఆస్పత్రి నుంచి నాలుగు వరసల 150 అడుగుల బైపాస్ రహదారి నిర్మించాలని తీర్మానం చేశారు. దాదాపు 45 కోట్ల రూపాయలు రహదారి నిర్మాణానికి వ్యయం చేయనున్నారు.
- తిరుపతి నగరంలోని శ్రీనివాసం వసతి సముదాయం పక్కన గల వైఎస్సార్ మార్గం నుంచి సామవాయి మార్గం వరకు 40 అడుగుల వెడల్పుతో దాదాపు పది కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించనున్నారు.
- తిరుచానూరు అమ్మవారి దర్శనం అనంతరం యాత్రికులు తిరుపతి నగరంలోని మంగళం ప్రాంతానికి సులువుగా చేరుకోవడానికి వీలుగా 19కోట్ల 50 లక్షలతో 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
- టీటీడీ కేటాయించిన భూములు అంటూ తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ, కేశవాయనిగుంట ప్రాంతాల్లో అంతర్గత రహదారులకు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు.
Srinivas Sethu was Built to Control Traffic in Tirupati: సాధారణంగా భక్తులు తొలుత శ్రీవారిని దర్శించుకుని శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. తిరుపతిలో వాహనరద్దీ నియంత్రణకు ఇప్పటికే శ్రీనివాససేతు నిర్మించారు. కపిలతీర్ధం దాటిన తర్వాత శ్రీనివాససేతు పైనుంచి నేరుగా తిరుచానూరు వెళ్లవచ్చు. కానీ తిరుచానూరు భక్తుల పేరుతో నారాయణాద్రి ఆసుపత్రి నుంచి 150 అడుగుల రహదారి నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోద ముద్రవేయడం ఎవరి ప్రయోజనాలకోసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. తిరుపతి నగరపాలక సంస్థ చేపట్టాల్సిన మురుగునీటి కాలువల నిర్మాణాలకు కొన్ని ప్రాంతాల్లో తితిదే నిధులు కేటాయించడం మరింత వివాదాస్పదం అవుతోంది. రానున్న ఎన్నికల్లో కార్పొరేషన్ పరిధిలో తాము పెద్ద ఎత్తున పనులు చేపట్టామని చూపేందుకు భక్తుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.