Gummadi Kuthuhalamma : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. కుతూహలమ్మ వైద్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో చిత్తూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె రాజకీయ జీవితంలో ఎక్కువకాలం కాంగ్రెస్‌లో పనిచేశారు. 2014వ సంవత్సరంలో కాంగ్రెస్‌లో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. సుమారు ఏడాదిన్నర క్రితం టీడీపీకి కూడా రాజీనామా చేశారు.
కుతూహలమ్మ 1985 సంవత్సరంలో వేపంజేరి (ప్రస్తుతం జీడీ నెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత జీడీనెల్లూరు నుంచి పోటీ చేసి ఓటమిని చవి చూశారు.
కుతూహలమ్మ అకల మరణం రాజకీయ వర్గాలను కలచి వెేసింది. ఈమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆమె సేవలు చిరస్మరణియామని కొనియాడారు.
ముఖ్యమంత్రి సంతాపం : మాజీ మంత్రి కుతూహలమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్పందించిన టీడీపీ అధినేత : మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అకాల మరణం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. జెడ్పీ ఛైర్ పర్సన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవులు అధిరోహించి మహిళల అభ్యుదయాన్ని చాటి చెప్పారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు కొనియాడారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఆమె ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కుతూహలమ్మ మృతికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఆమె కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని కలిగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
నివాళులు అర్పించిన నారా లోకేశ్ : మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ మృతి బాధాకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆమె మృతి పట్ల నివాళులు అర్పించారు. కుతూహలమ్మ పదవులకే వన్నె తెచ్చారన్న లోకేశ్.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇవి చదవండి :