SILVER AMBARI : తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన దాతలు వెండి అంబారీలను అందజేశారు. ఏసీటీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లాది బాలసుబ్రమణ్యం, మల్లాది నాగేశ్వరరావు దంపతులు వాటిని వితరణగా అందజేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవాలకు అనుకూలంగా కోటి ముప్పై లక్షల రూపాయలు విలువ గల వెండి అంబారీలను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంబారీలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు దర్శన ఏర్పాట్లు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నేటి నుంచే బ్రహ్మోత్సవాలు: శ్రీకాళహస్తీశ్వరలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది. సోమవారం ముతో మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో శ్రీకాళహస్తి దివ్య కైలాసంగా దర్శనమిస్తుంది.
స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమివ్వనున్న దేవతామూర్తులు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవతామూర్తులకు స్వర్ణాభరణాలను అలంకరించనున్నారు. బ్యాంకు లాకర్లో భద్రపరిచిన ఆభరణాలను ఆలయ ఈవో విద్యాసాగర్ బాబు ఆధ్వర్యంలో ఆలయానికి తీసుకొచ్చారు. రాయల కాలం నాటి నుంచి ఇప్పటివరకు సోమస్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబీకాదేవి అమ్మవారు, కుమారస్వామి, విఘ్నేశ్వరునికి తయారు చేయించిన స్వర్ణ, వజ్రాభరణాలు, కాసుల హారాలు, కిరీటాలు, వంటి ఆభరణాలను బ్రహ్మోత్సవాలలో దేవతామూర్తులకు అలంకరింనున్నారు. దీంతో మాఢ వీధుల్లో స్వర్ణాభరణాలతో ఆది దంపతులు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇవీ చదవండి: