AP JAC Amaravati plans protests: ఓవైపు చర్చలు మరోవైపు సంప్రదింపులు, రాయబారాలు ఇలా శతవిధాలుగా ప్రయత్నించిన తరువాత వారంతా... ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని నిర్ణయించుకున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు.. చివరకు కార్యచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల కార్యచరణపై తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్ లో ఏపీ జేఏసీ అమరావతి సహ అధ్యక్షుడు ఫణి పేర్రాజు సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏపీ జేఏసీ అమరావతి సహ అధ్యక్షుడు ఫణి పేర్రాజు అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించిన కార్యాచరణపై తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్లో సమీక్ష నిర్వహించామని ఆయన తెలిపారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారని... అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వం వినియోగించడమేంటని ఆయన ప్రశ్నించారు. పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో అందకపొవడంతో ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి భయపడాల్సిన పరిస్ధితి నెలకొందన్నారు. స్వచ్చంధ పదవీ విరమణ అంటేనే భయపడే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. హక్కులను పరిరక్షించుకోవడానికి ఉద్యోగులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగస్తులందరు ఒకే తాటిపై ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులు లక్షలు సంపాధిస్తున్నారని సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలనుంచి దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగస్తులందరం మా హక్కుల కోసం పోరాడుతున్నామని వెల్లడించారు. మహిళా ఉద్యోగులు ఉద్యమ కార్యచరణలో భాగం కావాలని పేర్రాజు పిలుపునిచ్చారు. మన సమస్యలు మనమే పరిష్కరించుకునేలా కృషి చేయాలని పేర్కొన్నారు. మంత్రులు, మా సమస్యలు తెలియని మరి కొంతమంది మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షాత్తు సీఎం గారు ముఖ్యమంత్రి కాకముందు, అయిన తురువాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మూడు సంవత్సరాలు అయినా మా సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదు. పైగా అర్థిక, అర్థికేతర సమస్యలను తీర్చలేదు. మా సమస్యల పరిష్కారానికి అధికారులకు సైతం విన్నవించుకున్నాం. మా సమస్యలపై రాష్ట్ర మహా సభలలో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టుకోమ్మని ఏ రాజ్యాంగం చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికి వర్తించలేదు. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావనే ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించే పరిస్థితి. మా సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. ఉద్యోలంతా కలిసి కట్టుగా ఒక్క తాటిమీదే ఉన్నారు. ఉద్యోగసంఘాల నాయకులను సైతం మాతో కలిసి రావాలని తెలిపాం. ఫణి పేర్రాజు, ఏపీ జేఏసీ అమరావతి సహ అధ్యక్షుడు
ఇవీ చదవండి: