100 Eco tourism projects in AP: రాష్ట్రవ్యాప్తంగా కనీసం వంద ఎకో టూరిజం ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఏపీ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ డివిజన్ స్థాయిలోనూ 5 ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలు పంపాలని అధికారులకు.. మంత్రి సూచించారు. విశాఖ, తిరుపతి జూలలో కొత్త జంతువులను తీసుకురావాలని ఆయన సూచించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ అధికారులతో చర్చించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని కోరారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్ వరకు ట్రామ్ లేదా రోప్ వే ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని ఆదేశించారు.
మరోవైపు అటవీశాఖ నుంచి ఇష్టారాజ్యంగా జారీ చేసే ఎన్ ఓసీల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అటవీభూములకు సంబంధించి ఎన్ఓసీల జారీ రికార్డులు సక్రమంగా ఉండటం లేదని మంత్రి ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా 2522 ఫారెస్ట్ బ్లాక్ లలో సుమారు 37 లక్షల హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయని వాటిని పరిరక్షించాలని మంత్రి ఆదేశించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జననష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏనుగులు పొలాలు, గ్రామాల్లోకి వచ్చి నష్టం చేకూరుస్తున్నాయని, అటవీ సరిహద్దుల్లో ట్రెంచ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు జగనన్న లేఅవుట్లలోనూ మొక్కలు పెంపకంపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు పెద్దిరెడ్డి సూచించారు.
ఇవీ చదవండి