భార్య ప్రసూతి సమయంలో పక్కనే ఉందామని బయలుదేరిన యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామానికి చెందిన అల్లు అమ్మ నాయిడు.. విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పన్నెండేళ్లుగా మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఓ యువతితో గతేడాది వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భవతి.
అతని భార్యకు ఈ నెల 8న ప్రసూతి సమయంగా వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో తన భార్య దగ్గర ఉండాలని అమ్మ నాయుడు ఆదివారం ఉదయం యలమంచిలి నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామం దూకులపాడుకు బయల్దేరాడు. మార్గమధ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం-పూసపాటిరేగ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అమ్మ నాయుడు మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. గర్భవతి అయిన అతని భార్య గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.
ఇదీ చదవండి